Tuesday, November 26, 2024

వందే భారత్‌ రైళ్లను మించి హైడ్రోజన్‌ రైళ్లు.. వార్షిక బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

అమరావతి,ఆంధ్రప్రభ: పర్యావరణహితంగా ఉంటూ వేగంగా నడిచే హైడ్రోజన్‌ రైళ్లు భారతీయ రైలు పట్టాలపై పరిగెత్తనున్నాయి. రానున్న ఆర్ధిక సంవత్సరంలో దేశంలో హైడ్రోజన్‌ రైళ్లను ప్రవేశపె ట్టనున్నారు. దీనికి సంబంధించి వార్షిక బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం హై స్పీడ్‌ రైళ్లకు ప్రాధాన్యత నిస్తోంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్‌ రైలును రూపొందించింది. ఇప్పటికే ఎనిమిది సర్వీసులు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. రానున్న ఏడాదిలో మరో 500 వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు ఈ ఏడాది హైడ్రోజన్‌ రైళ్లను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రైళ్లను ప్రవేశపెట్టడంతోపాటు రైల్వేలో మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణ, బోగీల సంఖ్క పెంచేందుకు బడ్జెట్‌లో లక్షా 90 వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశముంది.

తొలి విడతలో 35 హైడ్రోజన్‌ రైళ్లు..

హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుతూ నడిచే రైళ్లను హైడ్రోజన్‌ రైళ్లు అంటారు. డీజెల్‌, ఎలక్ట్రిక్‌ ఇంజన్లకు ప్రత్యామ్నయంగా ఈ హై డ్రోజన్‌ ఇంజన్లను వాడుతారు. దీంతో కాలుష్యం పూర్తిగా తగ్గిపోయి పర్యావరణ హితంగా ఈ రైలు నడుస్తుంది. సాధారణ రైలు కంటే హైడ్రోజన్‌ రైలు చిన్నదిగా ఉంటుంది. ఆరు నుండి ఎనిమిది బోగీలు మాత్రమే ఉంటాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇది వందే భారత్‌ రైలు వేగంతో సమానం. ఒక్కసారి హైడ్రోజన్‌ను నింపింతే 600 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. తొలి విడతలో 35 ట్రైన్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా తక్కువ దూరం ప్రాంతాల్లో ఈ రైళ్లను నడపనున్నారు. తద్వారా ప్రయాణికులు ఇప్పుడున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పోల్చుకుంటే రెట్టింపు వేగంతో ఈ రైళ్లలో ప్రయాణించగలరు. తొలి విడతలో తమిళనాడు, ఆంధ్రా, కేరళ రాష్ట్రాలకు కూడా రైళ్లను కేటాయించనున్నారు. త్వరలో ఆంధ్రాలో హైడ్రోజన్‌ రైళ్ల ట్రయల్‌ రన్‌ జరగనున్నాయి. వందే భారత్‌ రైలు మాదిరే ఈ ట్రైన్‌ లో కూడా బెర్త్‌లు లేకుండా కేవలం సీటింగ్‌ మాత్రమే ఉంటుంది.

- Advertisement -

తొలిసారిగా చైనాలో వినియోగం..

హైడ్రోజన్‌ రైళ్లను తొలిసారిగా చైనాలో వినియోగంలోకి తెచ్చారు. చైనాకు ఇప్పటికే బుల్లెట్‌ రైళ్లు ఉన్నప్పటికీ పర్యావరణ హితంగా రైళ్లను నడపాలనే ఉద్దేశ్యంతో హైడ్రోజన్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైళ్లను చైనా రూపొందించింది. చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ ఈ రైళ్లను రూపొందించింది. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో కూడా హైడ్రోజన్‌ రైళ్లను నడపడంపై దృష్టి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement