Monday, November 25, 2024

ట్రీ సిటీగా హైద‌రాబాద్ కు అంత‌ర్జాతీయ గుర్తింపు… కెటిఆర్ హ‌ర్షం..

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు అధికారం చేపట్టిన నాటి నుంచి హ‌రిత తెలంగాణా కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు.. ఇందుకోసం హ‌రిత‌హారం అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి కోట్ల సంఖ్య‌లో మొక్క‌లు నాటి ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న హ‌రిత‌హారంతో తెలంగాణ పుడ‌మి త‌ల్లి ఆకుప‌చ్చ‌గా మారుతోంది. ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌న‌మే ప‌లుకరిస్తోంది. హ‌రిత తెలంగాణ కోసం ప్ర‌య‌త్నిస్తున్న రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి మ‌రో అరుదైన గుర్తింపు ల‌భించింది. ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ అనే సంస్థ‌‌.. 2020 ట్రీ సిటీగా హైద‌రాబాద్‌ను ప్ర‌క‌టించింది. హ‌రిత‌హారం విజ‌య‌వంతం అయింద‌న‌డానికి ఈ గుర్తింపే నిద‌ర్శ‌నం. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ట్రీ సిటీ ఆఫ్ ది వ‌రల్డ్‌గా హైద‌రాబాద్‌ను ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ గుర్తించడం చాలా సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ ట్రీ సిటీ జాబితాలో ఇండియా నుంచి హైద‌రాబాద్ న‌గ‌రం ఒక్క‌టే ఎంపిక కావ‌డం విశేషం. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు తాము చేసిన ప్ర‌య‌త్నాల‌కు ఇది గుర్తింపు అని కేటీఆర్ అన్నారు. హ‌రిత‌హారంలో భాగంగా హైద‌రాబాద్‌లో 2020 ఏడాది వ‌ర‌కు 2.4 కోట్ల మొక్క‌లు నాటిన‌ట్లు ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement