చౌటుప్పల్, ప్రభ న్యూస్ : హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలో విద్యా, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ సొంత గ్రామాలకు తమ తమ కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున వాహనాలలో తరలి వెళ్తుండడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. తమ తమ సొంత వాహనాలలో కుటుంబాలతో కలిసి గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో వాహనాల రద్దీ ఎక్కువైంది. ప్రధానంగా చౌటు-ప్పల్ పట్టణంతో పాటు- మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల సంఖ్య పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
టోల్ ప్లాజా వద్ద అన్ని దారులను ఓపెన్ చేసినప్పటికీ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. చౌటు-ప్పల్ ఏసిపి ఎన్ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్, విజయ మోహన్ తదితర ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు గాను అధికారులు, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు.