న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే విస్తరణ పనులను జీఎంఆర్ సంస్థ కాదంటే కేంద్ర ప్రభుత్వమే టెండర్లు వేసి పనులు పూర్తి చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 4 లైన్ల హైవేని 6 లైన్ల హైవేగా మార్చే అంశంపై మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల అథారిటీ, జీఎంఆర్ ప్రతినిధులు, కేంద్ర రవాణా శాఖాధికారులతో పాటు ఎంపీ కోమటిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. హైవే విస్తరణ పనులు ఆలస్యమవడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన కేంద్రమంత్రికి వివరించారు.
వచ్చే మంగళవారానికి గడ్కరీ సమీక్షా సమావేశాన్ని వాయిదా వేశారు. సమీక్ష అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఒప్పందం ప్రకారం జీఎంఆర్ సంస్థ 6 లైన్స్‌గా హైవేను విస్తరించాల్సి ఉన్నా నష్టం వచ్చిందని అబద్దాలు చెబుతూ నిర్మాణం పూర్తి చేయట్లేదని ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నానన్నారు. హైవేపై జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..