Thursday, November 21, 2024

విచిత్రం: గుండుతో డ్రైవర్.. గుర్తుపట్టని ఉబర్

హైదరాబాద్‌కు చెందిన ఉబర్ డ్రైవర్ శ్రీకాంత్‌కు వింత అనుభవం ఎదురైంది. తిరుమల వెళ్లి గుండు కొట్టించుకుని మళ్లీ విధుల్లో చేరదామని శ్రీకాంత్ వెళ్లగా.. ఉబర్ యాప్ అతడి ముఖాన్ని గుర్తుపట్టలేదు. దీంతో అతడు తన ఉద్యోగానికి దూరమై పస్తులు ఉంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 33 రోజుల క్రితం తిరుమల వెళ్లి ఫిబ్రవరి 27న హైదరాబాద్ తిరిగివచ్చిన శ్రీకాంత్.. పలుమార్లు సెల్ఫీతో ఉబర్ యాప్‌లో లాగిన్ అవడానికి ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో అతడి ఉబర్ అకౌంట్ పూర్తిగా బ్లాక్ కావడంతో అతడికి రోజువారీ ఉపాధి పోయింది.

ఏడాదిన్నరగా శ్రీకాంత్ ఉబర్‌లో 1,428 ట్రిప్పులు తిరిగి 4.67 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాడు. తన అకౌంట్ బ్లాక్ అయిన మరుసటి రోజు ఫిర్యాదు చేసేందుకు ఉబర్ కార్యాలయానికి వెళ్తే.. వారు పట్టించుకోకుండా వేరే డ్రైవర్‌ను పనిలో పెట్టుకున్నారని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్లీ మళ్లీ ఉబర్ కార్యాలయానికి వెళ్తే.. ఉన్నతాధికారులతో మాట్లాడి ఓ ఈ-మెయిల్ ఐడీ ఇచ్చారని, కానీ ఇంకా ఆ వ్యవహారం కొలిక్కి రాలేదన్నాడు. కాగా శ్రీకాంత్‌కు డ్రైవింగే జీవనాధారమని, అతడి కారుకు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందని ట్రాన్స్‌పోర్ట్ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలాయుద్దీన్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో సిస్టమ్ అల్గారిథమ్ డ్రైవర్ల ముఖాలను గుర్తించడం లేదని, గ్రీవెన్స్ కోసం సమర్థవంత యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీకాంత్‌కు ఎదురైన సమస్య మరేవరికి రాకూడదని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement