Tuesday, November 26, 2024

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల మకాం.. రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్న పోలీసులు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌లో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల హరియాణా పోలీసుల విచారణలో బయటపడింది. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఉగ్ర దాడులకు సంబంధించిన కీలకాంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర లోని నాందేడ్‌లో వీరు నాలుగు రోజులపాటు మకాం వేసినట్టు పోలీసులు చెప్పారు. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఉగ్రవాదులు నాందేడ్‌లో ఉన్నారని అక్కడి నుంచి బీదర్‌ మీదుగా గోవాకు వెళ్లారని పోలీసులు కూపీ లాగారు. వీరంతా ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్‌ హర్వీందర్‌ సింగ్‌ రింధా అనుచరులని పోలీసులు చెబుతున్నారు. పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలను నాందేడ్‌కు తరలించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని చెప్పారు. వీరు హైదరాబాద్‌లో కూడా తిరిగారని జన సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ భయాందోళ న‌లు సృష్టించే విధంగా పథకం రూపొందించాలని కుట్ర పన్నినట్టు హరియాణా పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో వీరు సంచరించారన్న అంశంపై నగర పోలీసులతో పాటు సీఐడీ, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఐడీ, ఇంటలి జెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు.

హరియాణా పోలీసులతో మాట్లాడి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని హరియాణాకు పంపించి మరింత సమాచారాన్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. హరియాణా పోలీసులు సమన్వయం చేసుకుని పని చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఉగ్రవాదులు నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు ఎలా వచ్చారు, రైలులో వచ్చారా, రోడ్డు మార్గాన చేరుకున్నారా, నాలుగు రోజులపాటు ఎక్కడ బస చేశారు. హోటల్‌లోనా లేక ఇతర కార్యాలయాల్లోనా, వారికి ఆశ్రయం కల్పించిందెవరు, హైదరాబాద్‌లో ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకున్నారా, నాలుగు రోజులు గడిపాక ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. హర్విందర్‌ సింగ్‌ రింధా అనుచరులు ఉగ్రవాదులని హరియాణా పోలీసులు తేల్చిచెప్పడంతో హర్విందర్‌ సింగ్‌ పూర్వ చరిత్రపై పోలీసులు దృష్టి సారించారు. మొత్తం మీద ఉగ్రవాదులు హైదరాబాద్‌లో సంచరించారని, రెక్కి నిర్వహించారని తేలడంతో పోలీసులు కఠిన చర్యలకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement