– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
దేశంలోని ఇతర సిటీస్‌తో కంపేర్ చేస్తే.. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ సంఖ్య ముంబై, న్యూఢిల్లీ సిటీల కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 2021–22లో అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో 2.61 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో దాదాపు 75,000 మంది భారతీయులేనని ఓపెన్ డోర్స్ నివేదిక పేర్కొంది. అయితే.. ఈ 75వేల మంది భారతీయుల్లో 30శాతం మంది హైదరాబాద్‌కు చెందిన వారే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
గత రెండేళ్ల నుంచి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 19 శాతం పెరిగింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అమెరికన్ యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల పెరిగిందని, 10లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో దాదాపు 21 శాతం మంది భారతీయ విద్యార్థులేనని ఆ నివేదికలో వెల్లడయ్యింది.
2020-21లో 1,67,582 మంది ఉండగా.. 2021-22లో 1,99,182 మంది భారతీయ విద్యార్థులు యుఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కాగా, కొవిడ్ కారణంగా కఠినమైన నిబంధనలు.. ప్రయాణ ఆంక్షలు పెడుతున్న చైనా.. విద్యార్థులకు వీసాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో భారతదేశం కంటే చైనా వెనుకబడి ఉంది. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23లో చైనాను అధిగమించే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
USలో డిమాండ్ ఉన్న కోర్సులు..
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 19 శాతం ఎక్కువగా గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్, మేనేజ్‌మెంట్‌లను ఎంచుకున్నారు. మొత్తంమీద, USలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 2020-21లో 9.14 లక్షల నుండి 2021-22 నాటికి 9.48 లక్షలకు పెరిగింది.