Friday, November 22, 2024

Bonalu లాల్​ దర్వాజ.. సింహవాహిని చెంత బోనాల సందడి!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్‌ పాతబస్తీ బోనాల సందడి ప్రారంభమైంది.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి.. తొలి బోనం సమర్పించారు. ఆశాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో మహంకాళికి బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, రెండు రోజులపాటు జరుగనున్న జాతరలో నేడు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు.


ప్రధాన ప్రాచీన ఆలయాలైన హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, లాల్‌ దర్వాజా, ఉప్పుగూడా, గౌలీపురా, సుల్తాన్‌ షాహీ, బేలా ముత్యాలమ్మ, మీరాలం మండి తో పాటుగా మరో 25 ప్రధాన దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమాలను నిర్వించనున్నారు. అలాగే కాకతీయుల నిర్మించి, నిజాంరాజులతో పూజలందుకుని తరతరాలుగా గోల్కొండ పటేళ్ల నిర్వహణలో ఉన్న ట్యాంక్‌ బండ్‌ కట్టమైసమ్మ బోనాల ఏర్పాట్లను పటిష్టంగా ప్రభుత్వం చేసింది. ఆషాఢ మాసంలో గోల్కొండ కోట (పూర్వ మంగళవరం) లోని జగదాంబ మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన బోనాలు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట అమ్మవారి ఆలయం దాటి పైదరాబాద్‌ పాతబస్తీలోని సింహవాహిని ప్రాచీన దేవాలయాల్లో ఆదివారం, సోమవారం జరిగే బోనాలతో ఆషాఢమాస బోనాలు ముగియనున్నాయి.

ఇది ఇలా ఉంటే హైదరాబాద్‌ తట్టితేనే చాలు ప్రాచీన ఆచారాలు, శాతబ్దాల క్రితం నాటి ఆలయాలు, సంప్రదాయులు కళ్ళముందు కదలాడుతాయి. కాకతీయుల కాలం నాటి సంప్రదాయాలను కుతుబ్‌ షాహీలు, నిజాంరాజులు కొనసాగించడంతో ఆనాటి సంప్రదాయాలు నేటికి సమాజంలో ఆచరణీయమయ్యాయి. కాకతీయ గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రునికాలంలో వర్షాకాలం ప్రారంభంలో గ్రామదేవతలకు బోనం సమర్పించి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే ఆచారం ఉండేది. అంటువ్యాధులు వ్యాపించకుండా అమ్మవారిని శక్తి కొలదిగా పూజించి బోనాలు సమర్పించడం ఆనాటి ఆచారంగా ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. ఈ ఆచారం ప్రజల్లో మిళితమై నేటికి వర్ధిల్లుతుందనడానికి ఆషాఢ మాస బోనాలు అద్దం పడుతున్నాయి.

ప్రకృతిని ఆరాధించి అమ్మవారిని పూజించే ఆచారం నేటికి తెలంగాణలో ఉందనడానికి బోనాలు నిదర్శనం. బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్నే బోనం అంటారు. సకలజీవులకు ఆహారం అందించే గ్రామదేవతలకు బోనం సమర్పించడం ఈ పండుగలోని ప్రత్యేకత.1813లో హైదరాబాద్‌ లో ప్లేగు వ్యాధిప్రభలినప్పుడు వ్యాధిని తరిమి వేయాలని హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ లో అమ్మవారికి బోనాలు సమర్పించిన చరిత్ర ఉంది.

హైదరాబాద్‌ లోని ప్రధాన ఆలయాలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటిం సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతావలయాన్ని పాతబస్తీలో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జరిగిన బోనాలకంటే అత్యధికంగా భక్తులు పాల్గొనే అవకాశాలతో పాటు సెలబ్రేటీలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం నిరంతరం భద్రతా చర్యలను చేపట్టింది.. ఈ సందర్భంగా తరతరాల ఆలయ నిర్వహకుల వంశానికి చెందిన ఆలయనిర్వహకుడు గోల్కొండ గౌతం కుమార్‌ పటేల్‌ మాట్లాడుతూ 1908లో మూసీ వరదలను నివారించాలని ఫతేజంగ్‌ నవాబ్‌ మహబూబ్‌ అలీఖాన్‌ పూజలు చేసినట్లు చరిత్ర ఆధారాలున్నాయని చెప్పారు.

- Advertisement -

ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు

హైదబాద్‌ పాతబస్తీలోని పలుప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధానంగా ప్రాచీన దేవాలయల రహదారుల్లో ప్రముఖల రాకపోకలుండటంతో ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటుగా భద్రతావలయాలను రూపొందించారు. ఆది,సోమవారాల్లో పాతబస్తీ, అంబర్‌ పేట,చార్మినార్‌, మీర్‌ చౌక్‌నూమా, నయాపూల్‌, బహుద్దూర్‌పుర పోలీసు స్టేన్ల పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు చార్మినార్‌, ఫలక్‌నూమా, ఓల్డ్‌ సీబీస్‌, అఫ్జల్‌ గంజ్‌, దారుల్‌ షఫా, ఇంజన్‌ బౌలిలో బస్సురూట్లను మళ్లించారు. ఈ ఆంక్షలు 16వతేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement