హైదరాబాద్, ఆంధ్రప్రభ: 76వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ను హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 2 జూలై నుంచి 5వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్,క్రీడా,పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలోఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కప్ ను ఘనంగా నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నుంచి దేశానికి సరిపడే క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ఎంతోప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని రూపొందించినట్లు తెలిపారు.
18వేల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించినట్లు చెప్పారు. దేశానికి రాష్ట్రానికి పేరుతెస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి,విలువైన ప్రదేశాల్లో ఇంటి స్థలాలను ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్యకోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 1173 మంది క్రీడాకారులకు రూ. 39 కోట్ల 16 లక్షల 34వేలను క్రీడా శాఖ ద్వారా ప్రోత్సహక నగదును ప్రభుత్వం అందించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 76వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ కు హైదరాబాద్ వేదిక కానుందన్నారు.
జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి స్టేడియంలో జూలై 2 నుంచి 5వరకు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్,స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ క్రీడాప్రాధికారిక సంస్థ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తోందని చెప్పారు. ఈ అక్వాటిక్ ఛాంపిియన్‌షిప్ లో జాతీయ స్థాయిలో 500 మంది ప్రముఖులతో పాటు 100 మంది ప్రముఖ క్రీడా కారులు పాల్గొననున్నారని చెప్పారు. మనదేశం నుంచి ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్న ప్రముఖ స్విమ్మర్స్ శ్రీహరి నటరాజ్, మనపటేల్, సజ్జన్ ప్రకాష్ లు పాల్గొంటారని తెలిపారు. ప్యారిస్ లోనిర్వహిస్తున్న ఒలింపిక్ పోటీలతో పాటు ఇజ్రాయిల్‌లో నిర్వహించే జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్,చైనాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్‌కు జాతీయ స్థాయిలో అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చిన స్మిమ్మర్స్‌ను ఎంపిక చేయనున్నారని తెలిపారు.
4రోజుల పాటు నిర్వహించే ఈ ఛాంపియన్‌షిప్ లో 42 ఈవెంట్లు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి,కార్యదర్శి ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.