Tuesday, November 26, 2024

మన నగరం మహా భద్రం.. పటిష్టమైన నిఘా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌కు రెండోస్థానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఊహించని స్థాయిలో విస్తరణ, మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెట్టుబడులే కాదు.. అత్యంత పటిష్టమైన భద్రత గల నగరాల్లో తెలంగాణ రాష్ట్ర రాజధానికి ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. ఐక్య రాజ్య సమితి (యూఎస్‌ స్టాటిస్టికల్‌ విభాగం) ఇదవరకు నిర్వహించిన సర్వేలో బెస్ట్‌ లివింగ్‌ సిటీగా, ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగంలో సేఫెస్ట్‌ సిటీగా ప్రతిష్టను దక్కించుకున్న మన హైదరాబాద్‌ మహానగరం తాజాగా భద్రతలో భేష్‌ అనిపించుకుంది.

హైదరాబాద్‌ నగరం చుట్టూ 380 కిలోమీటర్ల పరిధిలో చీమ చిటుక్కుమన్నా ఇట్టే పట్టేసే విధంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసిన నేపథ్యంలో దేశంలోనే రెండు టాప్‌ సిటీల్లో ఒకటిగా నిలిచింది. విశ్వనగరం వైపు విస్తరిస్తున్న హైదరాబాద్‌ చాలా భద్రమని యూఎస్‌ స్టాటిస్టికల్‌ సర్వే తేల్చి చెప్పింది.

- Advertisement -

దేశంలోనే అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థను కలిగి ఉన్న నగరాల్లో మన భాగ్యనగరం రెండో స్థానంలో నిలిచింది. విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌ 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు అత్యంత కీలకమైనవి కాగా, ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22, హైదరాబాద్‌ 41వ స్థానంలో నిలిచాయి.

వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సర్వే..

అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (యూన్‌ గుర్తింపు పొందిన సంస్థ) రూపొందించింది. తాజా జాబితాను ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేసింది. జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఉత్తమ స్థానం దక్కింది.

ప్రతిష్టకు ఇదీ కారణం..

అధ్యయన సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ప్రతీ వెయ్యి మంది నివాసితులకు 36.52 కెమెరాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో 117 సీసీ కెమెరాలతో చైనా దేశంలోని టైయావున్‌ నగరం ఉంది. ఇండియాలోని ఇండోర్‌ 64.4 కెమెరాలతో నాలుగవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 33.73 కెమెరాలతో రాజధాని ఢిల్లీ 16వ స్థానంలో ఉంది. టాప్‌ 20 నగరాల్లో ఇండియా నుంచి మూడు నగరాలు ఉన్నట్లు- నివేదిక వెల్లడించింది.

దేశం మెచ్చే కమాండ్‌ కంట్రోల్‌..

విశ్వనగరంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటు-లోకి వచ్చిన తర్వాత నిఘా మరింత పటిష్టమైంది. నగరంలోని 10 లక్షల కెమెరాలు కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. నగరంలో అదనంగా 5.80 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10 లక్షల కెమెరాలను కంట్రోల్‌లోకి చేశారు. దీంతో అడుగడుగూ సీసీ కెమెరాలో నిఘాలోకి వెళ్లింది. ఇప్పుడున్న మన హైదరాబాద్‌ మహానగరం దేశానికి ఆదర్శంగా నిలిచే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను కలిగిఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement