హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ సమీపంలో ఉండే ఇందిరా పార్క్ నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు పార్కు తెరిచి ఉంటుంది. అయితే ఇందిరా పార్క్ వద్ద తాజాగా కనిపించిన ఓ బ్యానర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి కాని జంటలకు పార్కులో ప్రవేశం లేదు అని ఆ బ్యానర్లో పేర్కొన్నారు. ఇట్లు పార్క్ మేనేజ్ మెంట్ అని ఆ బ్యానర్లో స్పష్టం చేశారు.
అయితే సదరు బ్యానర్‌పై తీవ్ర కలకలం రేగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యానరే దర్శనమిస్తోంది. దీనిపై స్పందించిన మీరా సంఘమిత్ర అనే సామాజికవేత్త జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీని ట్యాగ్ చేస్తూ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ‘పార్కులో ప్రవేశానికి పెళ్లిని అర్హత ప్రమాణంగా నిర్దేశించడం ఏంటి? పబ్లిక్ పార్క్ అంటే అందరికీ ప్రవేశం ఉంటుంది. బ్యానర్‌లో పేర్కొన్న అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య’ అని మీరా సంఘమిత్ర స్పష్టం చేశారు. ఈ బ్యానర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి ఇందిరా పార్క్ వద్ద ఆ బ్యానర్‌ను తొలగించారు.
ఈ వార్త కూడా చదవండి: భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం రేప్ కాదన్న హైకోర్టు