హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎంఐఎం పార్టీ టెర్రర్ కారిడార్ ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. నిజామాబాద్, బైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఇందుకు టీఆర్‌ఎస్, పోలీసులు హకరిస్తున్నారన్నారని సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో లవ్‌జిహాద్ కేసులలో పురోగతి లేదన్నారు. తెలంగాణ భారతదేశంలో ఉందా..? లేక పాకిస్తాన్‌లో ఉందా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ టు ఇస్లామాబాద్ వరకు టెర్రర్ కారిడార్ ఏర్పాటుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని, ఇందుకు టీఆర్‌ఎస్ సహకరిస్తోందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సమయంలో ఛత్రపతి శివాజీని పొగిడారని మురళీధర్ రావు అన్నారు. కానీ నిన్న బోధన్‌లో శివాజీ విగ్హం అంశంలో టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు. దాడులకు గురైన వారిపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీకి జై అంటే నేరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లిలో అబద్దాలు మాట్లాడారని మురళీధర్‌రావు విమర్శించారు. ముస్లిం మతోన్మాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కేసీఆర్ కారణమని వాటికి ఆయనే బాధ్యత వ్యహంచాలని డిమాండ్ చేశారు. బెంగళూరుకు వచ్చినన్ని పెట్టుబడులు హైదరాబాద్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నుండి హిందువులు వలసలు ఎందుకు జరిగాయని నిలదీశారు. పాతబస్తీలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హిందువుల ప్రాణాలు, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ ఆలీ రోహ్యింగ్యాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో కశ్మీర్ ఫైల్స్‌లాగా హైదరాబాద్ ఫైల్స్ కూడా వస్తోందని అన్నారు. కాశ్మీర్ ఫైల్స్‌ని ప్రశ్నిస్తే మాడి మసై పోతారని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కి రక్షణ లేక పోతే తెలంగాణకు కూడా లేనట్లేనని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..