హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిత్యం ఏదో ఒక వివాదంలో మునిగితేలుతోంది. ముఖ్యంగా హెచ్‌సీఏ చీఫ్‌గా మహ్మద్ అజారుద్దీన్ ఎన్నికైన తర్వాతి నుంచి దాని చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. తాజాగా అజారుద్దీన్, అర్షద్ అయూబ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ శ్రుతిమించి మరీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో జస్టిస్ దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమించడంపై మొదలైన చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. ఈ క్రమంలో అజర్, అర్షద్ మధ్య చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. ‘‘దేశాన్ని అమ్మేసిన ఫిక్సర్‌వు నువ్వు’’ అని అజర్‌ను అర్షద్ దూషించాడు. దీనికి అజర్ కూడా అంతే స్థాయిలో బదులిచ్చాడు. ‘‘హెచ్‌సీఏను దోచుకున్న దొంగవు నువ్వు. నీ మోసాలు నాకు తెలియనివా. నీపై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. నీ సంగతి తేలుస్తా’’ అని అజర్ హెచ్చరించాడు. , అయితే చివరకు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామంటూ రాజీకొచ్చారు.