Friday, November 22, 2024

హైదరాబాద్‌ కంపెనీ ఘనత.. విదేశాలకు ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌

హైదరాబాద్‌ : ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లు తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన సెలెస్టియల్‌ కంపెనీ ఓ కీలక ఒప్పందం చేసుకుంది. మెక్సికోకు చెందిన గ్రూపో మార్వెల్సాతో మార్కెటింగ్‌, సేల్స్‌ డిస్ట్రిబ్యూషన్స్‌లో డీల్‌ కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సెలెస్టియల్‌ కంపెనీ ప్రతినిధులు ఆదివారం వెల్లడించారు. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను మెక్సికోకు ఎగుమతి చేసేందుకు నిర్ణయించింది. తన వ్యాపార విస్తరణలో భాగంగా.. ఈ ఒప్పందం చేసుకున్నట్టు వివరించింది. మెక్సికన్‌ కంపెనీతో చేసుకున్న ఈ డీల్‌తో.. సెలెస్టియల్‌ 2,500 డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌, 800 ఆథరైజ్డ్‌ ఈ-సర్వీస్‌ కేంద్రాలు కానున్నాయి. 35 ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లను మెక్సికోకు ఎగుమతి చేసేందుకు నిర్ణయించింది. భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ కంపెనీగా హైదరాబాద్‌కు చెందిన సెలెస్టియల్‌ కంపెనీ రికార్డు సృష్టించింది.

వ్యూహాత్మకంగా ముందుకు..

ఈ సందర్భంగా సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సిద్ధార్థ దురైరాజన్‌ మాట్లాడుతూ.. రానున్న 3 ఏళ్ల కాలానికి సంబంధించిన లక్ష్యాలను కూడా ఆయన వివరించారు. 4,000 ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌లను మెక్సికోకు ఎగుమతి చేసేందుకు నిర్ణయించామన్నారు. దీంతో పాటు ఉత్తర అమెరికాలో కూడా తమ కంపెనీకి ద్వారాలు తెరుచుకున్నాయని వివరించారు. ఇక తమ వ్యాపారం విశ్వ వ్యాప్తంగా కానుందని ధీమా వ్యక్తం చేశారు. సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ.. 2020, మార్చి నుంచి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లను తయారు చేయడం ప్రారంభించింది. తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ కావడంతో భారీ డిమాండ్‌ ఉంది. ఇప్పటి వరకు 1,800 ట్రాక్టర్ల కోసం బుకింగ్స్‌ పూర్తయ్యాయి. అత్యంత వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని సిద్దార్థ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెక్సికన్‌ కంపెనీ గ్రూపో మార్వెల్సాతో డీల్‌ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. స్థానికంగా మార్కెటింగ్‌ చేయడంతో విదేశాలకు ఎగుమతి చేసేలా కృషిచేస్తున్నామని వివరించారు.

సెలెస్టియల్‌ను స్వాగతిస్తున్నాం..

గ్రూపో మార్వెల్సా కంపెనీ ఎండీ డియెగో ఇటురియోజ్‌ మాట్లాడుతూ.. మెక్సికోలో ట్రాక్టర్‌ పరిశ్రమ మార్కెట్‌ ఎంతో పెద్దదని తెలిపారు. సెలెస్టియల్‌ కంపెనీ రాకతో మరింత వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం.. రెండు కంపెనీలకు ఎంతో మేలు చేకూరుస్తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ రాకను స్వాగతిస్తున్నామని వివరించారు. మెక్సికో మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ కానుందన్నారు. 2019, మేలో సింగపూర్‌కు చెందిన ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ పెట్టుబడితో సెలెస్టియల్‌ ఈ-మొబిలిటీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మురుగప్పలో భాగమైన ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. 21.5 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి సెలెస్టియల్‌లో పెట్టేందుకు అంగీకరించింది. సుమారు 70 శాతం వాటాను తీసుకోనుంది. ఇది కంపెనీ వ్యూహాత్మక వృద్ధిని బలోపేతం చేయడంతో పాటు దాని నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement