మహారాజా యదవీంద్ర స్టేడియం వేదికగా ఇవ్వాల పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌పై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్…9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (64, 37 బంతుల్లో) చెలరేగడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయగలిగింది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఎదురుదెబ్బ్ తగిలింది. బెయిర్‌స్టో కమిన్స్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే 4 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ భువనేశ్వర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 5వ ఓవర్లో 14 పరుగులు చేసిన ధావన్ భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది.
సామ్ కర్రన్(27) 4వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 28 పరుగులు చేసిన సికిందర్ రాజా ఉనద్కత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో జితేశ్ శర్మ(19) కొంచెంసేపు ప్రతిఘటించాడు. చివరకు నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు.
ఈ దశలో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ చెలరేగారు. భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్లో 17 పరుగులు రాబట్టారు. 12 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన తరుణంలో 19వ ఓవర్లో 10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. 26 పరుగులు రాబట్టగలిగారు. దీంతో కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది పంజాబ్ జట్టు.