హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం త్రీడీ ప్రింటింగ్ పరిశ్రమకు హబ్‌గా మారనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఆవ్టొక్ ఎక్స్‌పోలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్రీడీ ప్రింటింగ్, ఆడిటివ్ టెక్నాలజీ ఆవిష్కరణల రంగంపై ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. గతంలో విదేశాల్లో సాంకేతికతను ఇక్కడికి తీసుకువచ్చేవాళ్లమని, ప్రస్తుతం భారత్‌లో టెక్నాలజీని అభివృద్ధి చేసి విదేశాలకు అందించడానికి తాము కృషి చేస్తున్నామన్నారు. మెడికల్, ఇండస్ట్రీ రంగాల్లోనూ త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.
రానున్న రెండురోజులు దేశవిదేశాలకు చెందిన 100కుపైగా పరిశ్రమలు, 50కిపైగా స్టార్టప్‌లు, 15కు పైగా నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు, 3000 మందికిపైగా ప్రతినిధులు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారన్నారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్, వైద్య పరికరాలు తదితర సదుపాయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి తెలిపారు. స్టార్టప్‌లకు నూతన ఆవిష్కరణలకు పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ మద్దతు, సహకారంతో రాష్ట్రంలో టీ హబ్, వీ హబ్, టాస్క్ వంటి స్టార్టప్‌లతో సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ ఇటీవల వార్తల్లో నిలిచిందని, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ త్రీడీ ప్రింటెడ్ ఇంజిన్‌తో కూడిన ఓ ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిందని మంత్రి గుర్తు చేశారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంగా అది గుర్తింపు పొందిందని చెప్పారు. వివిధ పరిశ్రమలు, పరిశోధన సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని తమ పారిశ్రామిక భాగస్వామిగా చేసుకోవాలని మంత్రి కోరారు. పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయన్నారు. అంతకముందు ఆవ్టొక్ ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన పలు త్రీడి ప్రింటింగ్ ఉత్పత్తులను కేటీఆర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీ డైరెక్టర్ రమాదేవీ లంక, పలువురు త్రీడీ ప్రింటింగ్ ఆవిష్కర్తలు, తయారీదారులు పాల్గొన్నారు.