Sunday, November 17, 2024

వీఎఫ్‌ఎక్స్‌ హబ్‌గా హైదరాబాద్‌.. గేమింగ్‌, యానిమేషన్‌, ఈ స్పోర్ట్స్ రంగాల్లోనూ భారీ వృద్ధి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వినోదాన్నందించే సినిమా మాధ్యమం కొవిడ్‌ సంక్షోభం తర్వాత తిరిగి పుంజుకుంది. ఈ రంగంలో ప్రస్తుత ట్రెండ్‌గా ఉన్న విజువల్‌ ఎఫెక్ట్స్‌(వీఎఫ్‌ఎక్స్‌) సాంకేతికతకు రాష్ట్ర రాజధాని హబ్‌గా మారుతోంది. ఇటీవల దేశంలో నిర్మితమైన భారీ సక్సెస్‌ఫుల్‌ చిత్రాల విజువల్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ హైదరాబాద్‌లోనే రూపుదిద్దుకున్నట్లు సినిమా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌ తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో ప్రఖ్యాత విఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు నిర్మితమవుతున్నట్లు సమాచారం. కొవిడ్‌ తర్వాత పుంజుకున్న సినిమా రంగంతో పాటు ప్రస్తుతం పాపులర్‌గా మారిన ఓవర్‌ ది టాప్‌(ఓటీటీ), మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కీలకంగా మారింది.

ఈ రంగంలో పనిచేసేందుకు విరివిగా లభ్యత కలిగిన హైదరాబాద్‌ నగరంలో రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, యానిమేషన్‌, ఈ స్పోర్ట్స్‌ తదితర రంగాల్లో కలిపి సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని పలు ప్రముఖ కన్సల్టెన్సీలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ రంగాల్లో కలిపి హైదరాబాద్‌లో ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల వద్ద గణాంకాలున్నాయి. భవిష్యత్తులో పెట్టుబడులు భారీగా వస్తే మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యానిమేషన్‌, గేమింగ్‌ రంగాల్లో వస్తాయని ఐటీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వచ్చే ఏడాది అందుబాటులోకి ఇమేజ్‌ టవర్‌….

గేమింగ్‌, యానిమేషన్‌ రంగాల్లో కంపెనీలకు సకల మౌళిక సదుపాయాలు కల్పించేందుకుగాను ప్రభుత్వం నిర్మిస్తున్న ఇమేజ్‌ టవర్‌ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ టవర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 1.9 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్‌ నిర్మాణ ప్రదేశం కలిగిన ఈ ఇమేజ్‌ టవర్‌లో ఆడియో, వీడియో ఎడిటింగ్‌ సూట్‌లతో పాటు డేటా సెంటర్‌, డబ్బింగ్‌ సూట్‌, అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాంకేతికత, త్రీడీ యానిమేషన్‌ సూట్‌లు తదితర అత్యాధునిక సదుపాయాలు కంపెనీలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌లో పెట్టుబడి పెట్టే కంపెనీలకు కార్యకలాపాలు నిర్వహించుకోవడం సులభంగా మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement