హైదరాబాద్: గోల్ఫ్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ది చెందుతుందని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజికి అద్దం పట్టేలా గోల్ఫ్ క్లబ్‌ను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ టోర్నమెంట్లను హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ 2022 ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని విన్నర్లకు, రన్నర్లకు ట్రోఫీలు , ప్రైజ్ మనీ అందించారు. ఈ టోర్నమెంట్లో 121 ప్రొఫెషనల్ గోల్ఫర్స్, 5 అమెచ్యూర్ గోల్ఫర్స్, ఇండియా, అమెరికా, శ్రీలంక ,నేపాల్, బంగ్లాదేశ్ లోని ప్రముఖ అంతర్జాతీయ గోల్ఫర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గోల్ఫ్ టోర్నమెంట్లో ఢిల్లికి చెందిన మనుగందాస్ మొదటి స్థానం సాధించినందుకు 6 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, రెండో స్థానంలో నిలిచిన చండీగడ్‌కు చెందిన యువరాజ్ సింగ్‌కు నాలుగు లక్షల రూపాయల ప్రైజ్ మనీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించారు. అలాగే ఈ టోర్నీలో పాల్గొన్న గోల్ఫ్ క్రీడాకారులకు, నిర్వాహకులను అభినందించారు.