దేశంలో విద్యుత్ వాహనాల కంటే హైబ్రీడ్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. హైబ్రీడ్ వాహనాల్లో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. దీని సహాయంతో హైబ్రీడ్ వాహనాల మైలేజీ మెరుగ్గా ఉంటోంది. ప్రస్తుతం విద్యుత్ వాహనాల ధరలు ముఖ్యంగా కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మైలేజీతో పాటు హైబ్రీడ్ వాహనాల్లో అత్యాధునిక ఫీచర్లు ఉంటున్నాయి. దీంతో కస్టమర్లు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారని ఆటో పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో చాలా మంది కస్టమర్లు కారు కొనుగోలు చేసే ముందు రకరకాల ఆప్షన్లను పరిశీలిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, హైబ్రీడ్ వాహనాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో ఎక్కువ మంది కస్టమర్లు విద్యుత్ కార్లకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ కార్లను ఎంపిక చేసుకుంటున్నారని కంపెనీలు గుర్తించారు. ఫలితంగా 2023లో కార్ల కంపెనీలు భారీ స్థాయిలో హైబ్రీడ్ కార్లను మార్కెట్లోకి తీసుకు వచ్చాయి. 2023లో ఇప్పటి వరకు 51 మోడల్ హైబ్రీడ్ కార్లు మార్కెట్లోకి వస్తే, కేవలం 29 విద్యుత్ కార్లు మాత్రమే వచ్చాయి.
ధర తక్కువ…
విద్యుత్ కార్లతో పోల్చితే హైబ్రిడ్ కార్ల ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో పాటు విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు కస్టమర్లకు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కార్లలో ఆధునిక ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
విద్యుత్ కార్ల విషయంలో ప్రస్తుతం మార్కెట్లో ఒక సారి ఛార్జింగ్ చేస్తే అత్యధికంగా 400-450 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్లు లేవు. వాస్తవ రేంజ్ దీని కంటే కూడా తక్కువగానే ఉంటుంది. ఛార్జింగ్ సదుపాయలు కూడా పెద్దగా పెరగకపోవడం, పెట్రోల్, హైబ్రీడ్ కార్లతో పోల్చితే చాలా ఎక్కువగా ఉండటం వంటి కారణాల మూలంగా ఈవీల పట్ల కస్టమర్లు ఎక్కువ ఆకర్షితులు కావడంలేదు.
హైబ్రీడ్ కార్ల సరాసరి ధర 16.98 లక్షలుగా ఉంది. అదే విద్యుత్ కార్ల సరాసరి ధర 17.71 లక్షలుగా ఉందని మార్కెట్ పరిశోధన సంస్థ జిటో డైనమిక్స్ తెలిపింది. 2023 లో జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో హైబ్రీడ్ కార్ల వాటా 12.6 శాతంగా ఉంది. ఇదే కాలంలో విద్యుత్ కార్ల వాటా 2.3 శాతంగా మాత్రమే ఉంది.
పూర్తి విద్యుత్ కార్లను వినియోగదారులు అంగీకరించే ముందు మధ్యంతరంగా హైబ్రీడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయడుతున్నారు. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాటా నిక్సెన్ విద్యుత్ కారు దర 18.69 లక్షలుగా ఉంటే, మారుతీ సుజుకీ హైబ్రీడ్ కారు గ్రాండ్ విటారా 18.33 లక్షలకు వస్తోంది. కస్టమర్లు ఎలాంటి సందేహాలు లేకుండా విద్యుత్ కార్లను కొనుగోలు చేసేందుకు మరో మూడు నాలుగు సంవత్సరాలు పడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
ఛార్జింగ్ సదుపాయాలు గణనీయంగా పెరిగితే రేంజ్ గురించిన ఆందోళనలు ఉండవని ఈ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు ఒక ఛార్జింగ్‌కు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్లు కూడా ఎక్కువగా అందుబాటులోకి రావాల్సి ఉంటుందని, వీటి ధరలు కూడా తగ్గాల్సి ఉందని ఈ రంగంలోని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కార్ల అమ్మకాలు పెరిగితే ధర కొంతమేర తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
హైబ్రీడ్ కార్లతో పోల్చితే విద్యుత్ కార్ల విషయంలో పెట్రోల్ ఖర్చు రూపంలో రెండు సంవత్సరాల్లో 80 శాతం కలిసి వస్తుందని, రిపేర్లు, ఇతర నిర్వాహణ ఖర్చుల రూపంలో 36 శాతం విద్యుత్ కార్లలో తక్కువగా ఉంటుందని జిటో డైనమిక్స్ తెలిపింది. దీర్ఘకాలంలో విద్యుత్ కార్ల నిర్వహణ తక్కువ ఖర్చు అవుతుందని పేర్కొంది. 2017తో పోల్చితే 2023 నాటికి ఇండియన్ ఈవీ కార్ల మార్కెట్ 100 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 లో దేశంలో విద్యుత్ కార్లు 44,489 యూనిట్ల అమ్మకాలు జరిగితే 2023 నాటికి 89,137 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
2024లో విద్యుత్ కార్ల అమ్మకాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. 2024లో మారుతీ సుజుకీతో పాటు, ప్రస్తుతం వీటిలో మార్కెట్ లీడర్‌గా ఉన్న టాటా మోటార్స్ కూడా మరిన్ని కొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. 2028 నాటికి తమ సంస్థ నుంచి వచ్చే విద్యుత్ కార్ల అమ్మకాలు 10 లక్షల యూనిట్లకు చేరుతాయని టాటా మోటార్స్ అంచనా వేసింది. 2027 నాటికి మొత్తం కార్ల అమ్మకాల్లో విద్యుత్‌కార్ల వాటా 25 శాతానికి చేరుతుందని టాటా మోటార్స్ తెలిపింది.
ఈవీ మార్కెట్లోకి పేరున్న కంపెనీలు…
విద్యుత్ కార్ల మార్కెట్లోకి పేరున్న కంపెనీలు పెద్ద సంఖ్యలో కొత్త మోడల్స్‌ను తీసుకురానున్నాయి. దేశీయ కంపెనీలుగా ఉన్న టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త మోడల్స్‌ను తీసుకు వస్తున్నాయి. ఎంజీ మోటార్స్, టెస్లా, వియత్నాంకు చెందిన విన్‌పాస్ట్ , వోక్సోవ్యాగన్, స్కోడా కంపెనీలు కూడా మన దేశ మార్కెట్లో దీర్ఘకాల ప్రణాళికతో విద్యుత్ కార్లను తీసుకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే చైనాకు చెందిన బీవౖౖౖెడీ కంపెనీ కూడా దేశంలో ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. వీటితో పాటు మరికొన్ని పాపులర్ కంపెనీలు కూడా మన దేశంలో విద్యుత్ కార్లను తీసుకు రావాలని భావిస్తున్నాయి. రానున్న రెండు మూడు సంవత్సరాల్లో మారుతీ సుజుకీ, టయోటా కంపెనీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యుత్ కార్లు రానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు మార్కెట్లో పెద్ద సంఖ్యలో హైబ్రీడ్ కార్లను ప్రవేశపెడుతున్నాయి.
ప్రస్తుతం రెండు విద్యుత్ కార్లను విక్రయిస్తున్న హ్యుండాయ్ కంపెనీ రానున్న సంవత్సరాల్లో కస్టమర్ల అభిరుచి మేరకు మరిన్ని మోడల్స్‌ను తీసుకు వస్తామని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ చెప్పారు. హ్యుండాయ్ 2019లో కోనా పేరుతో విద్యుత్ కారును తీసుకు వచ్చింది. తరువాత 2023లో ప్రీమియం మోడల్ ఐయానిక్5ని లాంచ్ చేసింది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్‌తో 631 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ ఈ కార్లను 1,100 యూనిట్లు విక్రయించింది. మరిన్ని విద్యుత్ మోడల్స్న తీసుకు వచ్చేందుకు కంపెనీ 20 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తరుణ్ గార్గ్ తెలిపారు.
దేశంలో విద్యుత్ కార్ల అమ్మకాల్లో రెండో స్థానంలో ఉన్న ఎంజీ మోటార్స్ ఇండియా కూడా రానున్న సంవత్సరాల్లో మరిన్ని కొత్త మోడల్స్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంజీ మోటార్స్ ఎంజీ జెడ్ఎస్, కామెట్ పేరుతో రెండు మోడల్స్‌ను విక్రయిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ 18 వేల విద్యుత్ కార్లను విక్రయించింది. కంపెనీ మొత్తం కార్ల అమ్మకాల్లో విద్యుత్ కార్ల వాటా 30 శాతంగా ఉందని కంపెనీ డిప్యూటీ ఎండీ గౌరవ్ గుప్తా తెలిపారు. జీరో పొల్యూషన్ మొబిలిటీపై నీతి ఆయోగ్ ఇచ్చిన పిలుపు మేరకు తమ కంపెనీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 వేల ఛార్జింగ్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వీటిలో పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు, కస్టమర్ హోం ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయని గుప్తా వివరించారు.
భారత్‌లో విద్యుత్ కార్లతో పాటు, హైబ్రీడ్ కార్లు, ఐసీఈ ఇంజిన్ కార్ల అమ్మకాలు కలిసే ఉంటాయని టయోటా మోటార్ కార్పోరేషన్ ఛైర్మన్ ఆకియో టయోడా అభిప్రాయపడ్డారు. విద్యుత్ కార్లతో పాటు హైబ్రీడ్, ఇథనాల్ బ్లెండెడ్ హైడ్రోజన్, సీఎన్జీ టెక్నాలజీ ఆధారిత కార్లను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విద్యుత్ కార్ల కంటే హైబ్రీడ్ కార్ల వైపే కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్సీ భార్గవా అభిప్రాయపడ్డారు. కస్టమర్లకు అనుగుణంగా పరిశ్రమకు మల్టిdపుల్ టెక్నాలజీలతో తయారు చేసే కార్లు అవసరమని ఆయన చెప్పారు.