అమరావతి, ఆంధ్రప్రభ:కొత్త వంగడాలతో చేపట్టిన టమోటా సాగు సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్ర ఉద్యానశాఖ యూఎస్-6242, అన్సోల్, జువేల్ పేర్లతో కూడిన హైబ్రిడ్ నూతన వంగడాల వినియోగాన్ని టమోటా సాగులో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతుల ద్వారా 250 ఎకరాల్లో హైబ్రిడ్ రకాల టమోటాలను సాగు చేయించారు.
పెట్టుబడి వ్యయంలో రైతులకు హెక్టారుకు రూ 68,225 లు ఇచ్చి ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు ద్వారా ఎకరాకు 35 నుంచి 40 టన్నుల అత్యధిక దిగుబడి వచ్చింది. సాహో, సాహితీ వంటి సాధారణ రకం వంగడాల ద్వారా వచ్చిన దిగుబడి ఎకరాకు 15 నుంచి 20 టన్నులకు మించలేదు. రబీ సీజన్ లో మొదలు పెట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా అధిక దిగుబడి, నాణ్యతతో కూడిన టమోటాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కూడా సాధారణ రకం టమోటాల కన్నా అధిక లాభాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
సాధారణ వంగడాలతో పండించిన టమాటాల 15 కేజీల బాక్స్ రూ 70 నుంచి 80 పలికితే హైబ్రీడ్ వెరైటీలకు రూ.190 నుంచి 200 వరకు వచ్చినట్టు అంచనా. అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టు-కుని నిలబడటం హైబ్రిడ్ వంగడాల ప్రత్యేకత అని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో టమోటా సాగులో నూతన వంగడాల వినియోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన చేపట్టాలని ఉద్యానశాఖ భావిస్తోంది. యూఎస్-6242, అన్సోల్, జువేల్ వంగడాల టమాటాల్లో గుజ్జు అత్యధికంగా ఉండటం వల్ల ప్రాసెసింగ్ కు బాగా ఉపయోగపడుతున్నాయి.
దీంతో ప్రాసెసింగ్ కంపెనీల నుంచి ఆ టమాటాలకు అత్యధిక డిమాండడ్ ఏర్పడింది. హైబ్రిడ్ వంగడాలు వినియోగించి టమాటా సాగు చేసే రైతులకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. కిలో రూ 6 కన్నా తక్కువగా కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్.పీ.వో) నుంచి టమాటాలను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు- చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాసెసింగ్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.