కర్నాటక సీఎం సిద్ధరామయ్యలో పాల్గొన్న లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకొని వాహనంపైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. బెంగళూరులో రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫును సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
అయితే ఈ ప్రచార ర్యాలీలో ఒక చోట ప్రచారం వాహనంపైకి ఎక్కి ఆ వ్యక్తి మంత్రి రామలింగారెడ్డి, లోక్‌సభ అభర్థి సౌమ్యరెడ్డికి పూలమాలలు వేశాడు. ఆ పక్కనే సీఎం సిద్ధరామయ్య కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి పూలమాల వేస్తున్న సమయంలో అతని నడుముకు తుపాకీ ఉండటం అందరినీ భయాందోళనకు గురిచేసింది.
అయితే గన్ ధరించిన వ్యక్తిని రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసమే అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంటపెట్టుకుంటున్నాడని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో లైసెన్సెడ్ గన్‌లను సైతం పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సైతం గన్ పోలీసులకు అప్పగించకుండా మినహాయింపు పొందాడట.
‘బెంగళూరులోని విల్సన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంతో రియాజ్‌పై పలు దాడులు జరిగాయి. ఈ నేపథ్యలోనే ఆత్మ రక్షణ కోసం అతను గన్ వెంటపెట్టుకుంటున్నాడు. ఆ తుపాకీ సంబంధించిన లైసెన్స్ కూడా ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై బీజేపీ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. సీఎం సిద్ధరామయ్యకు పోకిరిలు, రౌడీలు పూలమాలలు వేస్తారని చూపించేందుకే ఈ ఘటన జరిగిందని బీజేపీ దుయ్యబట్టింది.