ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే హోం ఐసోలేషన్‌లో పెడతారు లేదా ఆస్పత్రిలో చేరుస్తారు. కరోనా బాధితులకు కుటుంబ సభ్యులు ధైర్యం కల్పిస్తూ అండగా ఉంటారు. వైద్యుల సూచన మేరకు కరోనా తగ్గేంత వరకు ఆహారం, మందులు అందిస్తూ సేవలు చేస్తూ ఉంటారు. కానీ కరోనా సోకిన ఓ మహిళ పట్ల తన భర్త అమానుషంగా ప్రవర్తించాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో అమానుషం చోటు చేసుకుంది. కరోనా సోకిన మహిళ పట్ల ఆమె భర్త అమానుషంగా వ్యవహరించాడు.
కరోనా సోకిందని తన భార్యను భర్త మేడి పెద్దయ్య బాత్‌రూంలో బంధించాడు. దీంతో వారం రోజులుగా బాత్‌రూంలోనే కరోనా బాదితురాలు నరకయాతన అనుభవిస్తోంది. అన్నం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మహిళ సమస్యను స్థానికులు మీడియా దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో పోలీసులు, వైద్యారోగ్యశాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఇంట్లో ఓ రూంలో ఐసోలేట్ చేయించారు. దాతల సహాయంతో పౌష్టికాహారం ఏర్పాట్లు చేశారు. కరోనా బాధితురాలి పట్ల భర్త అమానుష చర్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.