Friday, November 22, 2024

ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల కోసం కాలేజీల వేట.. సగం పైగా కాలేజీల్లో ఇప్పటికే అయిపోయిన సీట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్త నంబర్‌ నుంచి ఓ ఫోన్‌ కాల్‌… దాన్ని రిసీవ్‌ చేయగానే హలో…సార్‌ మేము ఫలానా ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి కాల్‌ చేస్తున్నాము. మీరు ఎంసెట్‌లో క్వాలిఫై అయ్యారా? లేదా? అని ప్రశ్నిస్తారు. మీరెవరు? అని అడిగితే మేము ఫలానా ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి కాల్‌ చేస్తున్నాము సార్‌/మేడమ్‌ అని సమాధానమిస్తారు. మీకు బీటెక్‌ సీటు కావాలా? అని అడుగుతారు. అది మేనేజ్‌మెంట్‌ (బీ కేటగిరీ) కోటా ఐనా.. కౌన్సెలింగ్‌ సీటైనా ఇస్తామని అంటారు. ఒకవేళ మనం ఎంసెట్‌లో క్వాలిఫై కాలేదంటే.. మరీ సీటు కావాలా? మీరు ఎంత పే చేయగలరు అని ప్రశ్నిస్తారు. మనం అడిగిన దానికి వాళ్లు చెప్పిన ఫీజుకు కాస్త తేడా ఉంటే ఒకసారి కాలేజీకి రండి… మాట్లాడుదాం.. తక్కువ చేస్తాం.. అంటారు.

ఇలా కొన్ని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు నేరుగా ఇంటర్‌ పాసై.. ఎంసెట్‌ రాసిన విద్యార్థులకు నేరుగా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇంటర్‌ కాలేజీల నిర్వాహకుల నుంచి విద్యార్థుల ఫోన్లను సేకరించి మీకు ఇంజనీరింగ్‌ సీటు కావాలా అంటూ ఫోన్లలో బేరసారాలు చేస్తున్నాయి. మేనేజ్‌ మెంట్‌ కోటా సీట్ల భర్తీకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఈనెల 20న తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆగస్టు 31 కల్లా అడ్మిషన్‌ ప్రక్రియను ముగించేయాల్సి ఉంది. అలాగే సెప్టెంబర్‌ 15న ఎంపికైన విద్యార్థుల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది.

ఈక్రమంలో సీట్లు భర్తీ కాని చాలా కాలేజీలు అడ్మిషన్ల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఈక్రమంలోనే నేరుగా విద్యార్థులకే ఫోన్లు చేసి సీటు కావాలా? అంటూ బేరమాడుతున్నాయి. కొన్ని కాలేజీలు ఏడాదికి 80 వేలు చెబుతుంటే…కొన్ని కాలేజీలు సంవత్సరానికి లక్ష..ఆపైన చెల్లించాలని దందాకు తెరలేపుతున్నాయి. కాలేజీల నిర్వాహకులు చెప్పిన ఫీజుకు అటు ఇటుగా దగ్గర ఉంటే ఒకసారి కాలేజీకి రండి తగ్గిద్దామని అంటున్నారు. హాస్టల్‌కు మళ్లి వేరే ఫీజు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ అడ్మిషన్లను కూడా కల్పిస్తామని మరికొన్ని కాలేజీలు విద్యార్థులకు వాట్సాప్‌ మెస్సేజ్‌లు పెడుతున్నాయి.

- Advertisement -

అయితే ఇది నమ్మి అడ్మిషన్ల కోసం కళాశాలలకు వెళ్లే విద్యార్థులను రకరకాల ఫీజులు చెప్పి ఫోన్‌లో చెప్పిన దానికంటే ఎక్కువ ఫీజు చెబుతున్నారని పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల నిర్వహాకులు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వ, సాధారణ ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు, ఫోన్‌ నెంబర్‌లను సేకరించి ఫోన్‌లు చేసి ఈరకంగా వలవేస్తున్నారు. చేసేదిలేక విద్యార్థుల తల్లిదండ్రులు వారి జేబులను గుళ్ల చేసుకుంటున్నారు.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఇతర అనుబంధ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని నిబంధనలను పాతరేసి మేనేజ్‌మెంట్‌ కోటా (బీ-కేటగిరీ) సీట్లను రూ.లక్షలకు అమ్మేసుకుంటు-న్నాయి. తమ ఆధీనంలో ఉండే 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నాయి. సగంపైగా కాలేజీల్లో ఇప్పటికే ఈ కోటాలోని సీట్లు భర్తీ అయ్యాయి. కొన్ని బ్రాంచీలకు సంబంధించిన సీట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement