కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. దీంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటూ ఇలా ఆకలి చావుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. పేదరిక వ్యతిరేక సంస్థ ఆక్స్‌ఫామ్ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది ఆకలితో అలమటిస్తూ కన్నుమూస్తున్నారు. ది హంగర్ వైరస్ మల్టిప్లైస్ పేరుతో ఆక్స్‌ఫామ్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది.
కరోనా కారణంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలి కారణంగా 11 మంది చనిపోతున్నట్లు ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. దీంతో కరోనా మరణాల కంటే ఆకలి మరణాలే ఎక్కువగా నమోదవుతున్నాయని స్పష్టమైంది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార భద్రత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గతేడాది కంటే ఈ సంఖ్య రెండు కోట్లు పెరిగింది. వీళ్లలో మూడింట రెండు వంతుల మంది తమ దేశాల్లో మిలిటరీ సంఘర్షణ కారణంగా ఆకలి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆక్స్‌ఫామ్ అమెరికా ప్రెసిడెంట్, సీఈవో అబ్బీ మ్యాక్స్‌మ్యాన్ వెల్లడించారు, ముఖ్యంగా ప్రపంచంలోని ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, సౌత్ సూడాన్, సిరియా, యెమెన్‌లాంటి దేశాలు ఆకలి చావులకు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఈ ఆకలి చావులను ఆపడానికి ప్రభుత్వాలు తమ దేశాల్లోని ఘర్షణలను ఆపాలని ఆక్స్‌ఫామ్ కోరింది. ఆకలిపై పోరాటానికి ఐక్యరాజ్యసమితికి అవసరమైన నిధులను దేశాలు అందించాలని కూడా అభ్యర్థించింది.
ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 43వేల కరోనా కేసులు, 911 మంది మృతి