కొలంబో:శ్రీలంకలో ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహార పదార్థాల కొరత వేధిస్తోంది. నిత్యావసర సరుకుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం ఆహార సంక్షోభం మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. ఈ పరిస్థితినుంచి బయటపడేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం పంటలు పండించే సీజన్ మొదలవుతోంది. ఈ సీజన్‌లో అవసరమైనంత ఎరువులు అందించాలని భారత్‌ను కోరామని, అందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారం ప్రకటించారు. మరో 20 రోజుల్లో భారత్‌నుంచి ఎరువులు కొలంబోకు చేరుకుంటాయని ఆయన చెప్పారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత్ అందిస్తున్న రుణసాయంలో భాగంగానే ఎరువుల సరఫరా జరుగుతోందని ఆయన వెల్లడించారు. దేశంలోని ఆహార సంక్షోభం, పరిణామాలపై అధ్యక్ష భవనంలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయం వెల్లడించారు. మే-ఆగస్టు మధ్య శ్రీలంక యాలా సీజన్ పేరుతో రెండో విడత పంటలు పండిస్తారు. మిగతా సీజన్‌ను మహా అని పిలుస్తారు. ఈ సీజన్‌లోనే దేశంలో 30-40 శాతం మేర పంటలు పండిస్తారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని నిషేధిస్తూ గత ఏడాది ఏప్రిల్ 27న రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఫలితంగా పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దాంతో ఆహార ధాన్యాల కొరత, ఆర్థిక సంక్షోభం అనివార్యమైంది. రసాయనిక ఎరువుల వాడకంపై నిషేధం పెద్ద తప్పుడు నిర్ణయమని ఇటీవల అధ్యక్షుడు రాజపక్సే అంగీకరిస్తూ ఆ ఆదేశాలను రద్దు చేశారు. కనీసం ఈ సీజన్‌లోనైనా పంటల దిగుబడి మెరుగైతే సంక్షోభంనుంచి బయటపడతామని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అందులోభాగంగానే భారత్‌ను ఎరువులు సరఫరా చేయాల్సిందిగా భారత్‌లో శ్రీలంక దౌత్యవేత్త మిలిందా అభ్యర్థించారు. యేలా సీజన్‌లో 65,000మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భారత రాయబారి రాజేశ్‌కుమార్ ప్రకటించారు.
పన్నుల పెంపు..
ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న శ్రీలంక ఆదాయం పెంచుకునే మార్గాలను వదులుకోవడం లేదు. విలాసవస్తువులు, పదార్థాలపై పన్నులు పెంచింది. విదేశీ పర్యాటకుల కోసం వాడే మద్యం, వెన్న, పెరుగువంటివాటిపై భారీగా పన్నులు పెంచింది. ప్రత్యేకించి విదేశాలనుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చీజ్, పెరుగు, వైన్, ఎలక్ట్రానిక్ వస్తువులు, చాక్‌లెట్లపై 200 శాతం మేర పన్నులు పెంచింది. జూన్ 1వ తేదీనుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. విదేశీమారక ద్రవ్యం నిండుకోవడంతో 2020 మార్చిలో అన్ని రకాల దిగుమతులను ప్రభుత్వం నిషేధించింది. ఆ నిర్ణయమే ఇప్పటి సంక్షోభానికి కారణమైంది. అయితే ప్రజాందోళనల నేపథ్యంలో కొన్ని దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ వస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..