న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని భువనగిరి ఎంపీ (కాంగ్రెస్) కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ కష్టపడితే 40 నుంచి 50 సీట్లు వస్తాయని, కలసికట్టుగా బాగా కష్టపడితేనే అధికారం సాధ్యమని వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో ఒక నేత “నేనే గెలిపిస్తా” అంటున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన గెలిపిస్తానన్నారు కదా అని మిగతా నేతలు పనిచేయడం మానేస్తారని కోమటిరెడ్డి అన్నారు. నేను, నా మనుషులు అనుకుంటూ తమవారికే టికెట్లు ఇచ్చుకుంటే పార్టీ మునిగిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండూ ధనిక రాజకీయ పార్టీలని, వాటితో పోటీపడాలంటే కాంగ్రెస్ నేతలందరూ కలసికట్టుగా కష్టపడక తప్పదని సూచించారు.
ముఖ్యంగా గెలిచేవారికే టికెట్లు ఇవ్వాలని, గెలుపు అవకాశాలున్నవారు కొత్తగా పార్టీలో చేరినవాళ్లా.. లేక పాత కాంగ్రెస్ నేతలా అన్నది చూడకూడదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తేం 294 సీట్లలో కేవలం 26 సీట్లకే పరిమితమైనప్పటికీ 33 శాతానికి పైగా ఓటుబ్యాంకు కలిగి ఉందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేతలు తలా 4-5 సీట్లు గెలిపించేలా కృషిచేస్తే పార్టీ అధికారం సాధించడం కష్టం కాదని సూత్రీకరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిని మార్చిన తర్వాత రాష్ట్రంలో పార్టీ గాడిలో పడిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొత్త ఇంచార్జి మాణిక్ రావ్ థాకరే చాలా సీనియర్ నేత అని, అయినప్పటికీ అందరికీ మర్యాద ఇస్తూ ఓపికగా అందరూ చెప్పేది వింటున్నారని ప్రశంసించారు. గత ఇంచార్జి మాణిక్యం టాగోర్ మాత్రం ఎవరు చెప్పినా సరిగా వినేవారు కాదని, ఎవరైనా ఏదైనా చెబుతుంటే ఫోన్ చూస్తూ కూర్చునేవారని నిందించారు. త్వరలో తాను, మరికొందరు సీనియర్ నేతలు పాదయాత్రలు, బైక్ యాత్రలు ప్రారంభిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా నేతలందరూ కలిసి తిరుగుతారని అన్నారు.
పొత్తుల్లేవ్.. కానీ గెలిచాక సంకీర్ణమే
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. కేసీఆర్ బీజేపీని విమర్శించడం కోసం కాంగ్రెస్ పార్టీని పొడగాల్సిన అవసరం లేదని, ఇదంతా కేవలం రాజకీయ డ్రామాలో భాగమేనని అన్నారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీని ప్రశసించాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గురించి చెప్పాలని, కానీ ఆ విషయాన్ని కేసీఆర్ ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ను పొగడడం వెనుక కూడా ఇదే కారణమని, తద్వారా ఈటలను బదనాం చేయాలన్నదే కేసీఆర్ వ్యూహమని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉంటుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఎన్నికలకు ముందు పొత్తుల ప్రసక్తే లేదని తెలిపారు. పొత్తులకు తాము ఒప్పుకోమని అన్నారు. కాంగ్రెస్ ఒంటరి పోరాటమే చేస్తుందని వివరించారు. ఒకవేళ ఎన్నికలకు ముందే పొత్తులు పెత్తుకుంటే బీజేపీకి మరింత అవకాశం ఇచ్చినట్టవుతుందని సూత్రీకరించారు. తాను జరిగేదే చెబుతున్నానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే తాను చెప్పినట్టు హంగ్ ఫలితాలు వస్తే ఎన్నికల తర్వాత సెక్యులర్ పార్టీలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను సెక్యులర్ పార్టీలుగా ఆయన అభివర్ణించారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణ
మీడియా సమావేశం నిర్వహించడానికి ముందు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల గురించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రోడ్డు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్ సంస్థ అగ్రిమెంట్ ప్రకారం 2022 ఏప్రిల్‌లోనే రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలకు విస్తరించే పనులు ప్రారంభించాల్సి ఉందని, కానీ తమకు నష్టాలు వచ్చాయని చెబుతూ ఆర్బిట్రేషన్‌కు వెళ్లి విస్తరణ పనులు జాప్యం చేస్తోందని అన్నారు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీని, నితిన్ గడ్కరీని పలుమార్లు కలిసి చెప్పానని అన్నారు. రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ కూడా ఎప్పుడో పూర్తయిందని వెల్లడించారు. మంగళవారం నితిన్ గడ్కరీని కలిసి పనుల్లో జాప్యం గురించి వివరించానని, ఆయన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, జీఎంఆర్ ప్రతినిధులను పిలిచి మాట్లాడారని అన్నారు.
ఈ రహదారిపై 18 ప్రమాదాలు జరిగే ప్రాంతాలను నిపుణులు గుర్తించారని, వాటిని సరిదిద్దాలని కూడా తాను కేంద్రాన్ని కోరానని తెలిపారు. రూ. 2వేల కోట్లతో వలిగొండ నుంచి తొర్రూరు వరకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, భువనగిరి ఎంపీగా తన నియోజకవర్గంలో అత్యధిక జాతీయ రహదారి ప్రాజెక్టులను తీసుకొచ్చానని వెల్లడించారు. గడ్కరీతో జరిగిన భేటీలో రీజనల్ రింగ్ రోడ్డు గురించి కూడా మాట్లాడినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 500 కోట్లు ఇవ్వలేదని ఆరోపించారు. మరోవైపు ప్రాజెక్టు ప్రణాళికలో అవసరం లేకపోయినా ల్యాండ్ లాక్ అవుతుందంటూ పేద రైతుల భూములు తీసుకున్నారని, అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఉన్నాయని తెలిపారు. వాటిని భూసేకరణ నుంచి తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.