Saturday, November 23, 2024

మనుషుల అక్రమరవాణా ఆందోళనకరం.. ప్రజల భాగస్వామ్యంతోనే అరికట్టగలం: సునీత లక్ష్మారెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచంలో మాదక ద్రవ్యాలు, మారణాయుధాల అక్రమ రవాణా తర్వాత మనుషుల అక్రమ రవాణా ఆందోళన కల్గించే అంశమని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సంయుక్తంగా నిర్వహించిన ‘మానవ అక్రమ రవాణా’ పై అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత, మనుషుల అక్రమ రవాణాలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారని గణాంకాలు చెబుతున్నారని, ఇది చాలా బాధాకరమైన అంశమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ, ఉద్యోగ అవకాశాలు, సినిమా అవకాశాల పేరుతో బాలికలు, యువతులను నమ్మించి మోసగిస్తూ వారిని తీసుకెళ్లి విక్రయిస్తున్నారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. పేదరికం, కుటుంబ అవసరాలు తీరుస్తామని ఆకర్షించడం, నిరుద్యోగం, భర్త నుంచి విడిపోయిన మహిళలను లొంగతీసుకోవడం, ఒంటరిగా జీవిస్తున్న మహిళల నిరక్ష్యరాస్యత, విలాసవంతమైన జీవితం వంటివాటిని ఎరగా వేస్తూ మహిళలకు గాలం వేస్తున్నారని ఆమె వివరించారు. ఇవన్నీ మహిళల అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని తెలిపారు. స్వలాభం కోసం కొందరు మనుషులను కొనడం, అమ్మడం చేస్తున్నారని, అక్రమ రవాణాకు గురైనవారిని ఎక్కువగా వ్యభిచారకూపంలోకి నెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అడాప్షన్ రాకెట్లలో, కూలీలుగా, బాలకార్మికులుగా, బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని అన్నారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రభుత్వ సంస్థలతో పాటు పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని సునీత లక్ష్మారెడ్డి కోరారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో ముందుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు పోలీస్ కంట్రోల్‌రూమ్ 100, మహిళా హెల్ప్‌లైన్‌ 181, మహిళా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533, చైల్డ్ లైన్ నెంబర్ 1098కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్‌పర్సన్లతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణకుమారి, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement