- మహమ్మారి రాకతో చిన్నాభిన్నమైన సామాన్యుల కుటుంబాలు
- మారిన ప్రజల బ్రతుకు చిత్రం..
- పెరిగిన అపోహలు, తగ్గిన చైతన్యం..మంటగలుస్తున్న మానవత్వం
- వైరస్ ఎపుడు, ఎవరికి, ఎలా వస్తుందోనన్న భయాందోళనలో జనం
- ఏ కారణం చేత మరణించినా..కరోనా భ్రమే
- అందరిలోనూ లాక్ డౌన్ చర్చే..పెడితే ఆకలి చావులు, పెట్టకపోతే కరోనా మరణాలు
ఒక్క కరోనా.. అందరి జీవితాలను మార్చేసింది..మొదటి వ్యాప్తి నుంచి నేటి వరకు దిన దిన గండం..నూరేళ్లాయుషు అన్నట్టు ప్రజలు అరచేతిలో ప్రాణాలను పట్టుకుని జీవిస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కొవిడ్ రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో మానవత్వం కూడా చితి మంటల్లో కలిసిపోయింది. కరోనా పై అపోహలు పెరగడంతో పాటు..అవగాహన లేకపోవడంతో ప్రజలు వ్యాధితో ఇక్కట్లు పడుతున్నారు. కరోనా రెండో వ్యాప్తితో యావత్ దేశంతో పాటు తెలంగాణ కూడా అతలాకుతలం అవుతున్న పరిస్తితి. ఒకవైపు ఆక్సిజన్ లేక జనం ఆర్తనాదాలు పెడుతుంటే..మరోవైపు ప్రభుత్వాలు మాత్రం చోద్యంచూస్తున్నట్టుమిన్నుకుండిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మానవత్వం కూడా ఆ చితిమంటల్లోనే కలిసిపోతుంది. మహమ్మారి రాకతో ప్రజల బతుకు చిత్రం మారిపోవడంతో పాటు సామాన్యుల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి.
వైరస్ విజృంభనతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెడతారా, పెట్టరా..అనేది అటుంచితే..లాక్ డౌన్ మాటవింటేనే కొన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించాలంటే స్వీయ నియంత్రణ అవసరమని ప్రభుత్వాలు ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి ప్రవర్తిస్తుండడం వలనే కరోనా విస్తరిస్తుందనడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న వైరస్ యావత్ ప్రజానీకాన్ని వణికిస్తుండగా, ఇది మరికొంత కాలం మనతోనే సహజీవనం చేసేలా కనిపిస్తోంది. దీంతో క్షణ క్షణం భయం భయంగా బ్రతకాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి.
కరోనా తో మారిన ప్రజల బ్రతుకు చిత్రం..
కరోనా వైరస్ తో దేశ వ్యాప్తంగా ప్రజల బ్రతుకు చిత్రాలు మారిపోయాయి. తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు..అన్ని మారాయి. దీంతో పాటు ప్రజల ఆర్ధిక స్థితిగతులు కూడా అంతకంతకూ మారుతుండడంతో ఆయా కుటుంబాల్లో ఆర్ధిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి. దీంతో పాటు నిత్యావసర వస్తువులకు ధరలు పెరగడంతో ఏం కొనాలన్నా..తినాలన్నా ఆలోచించి ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రోజు కూలి చేసి జీవితాన్ని నెట్టుకొచ్చే వారికి పనుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులు. హైదరాబాద్ లోని పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, మాధాపూర్, బంజారాహిల్స్ రోడ్ నం 12, గౌలిగూడ, ఎల్ బి నగర్, ఉప్పల్ లాంటి కూలీల అడ్డాలో కూలి దొరక్క చాలా మంది వెనక్కి వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైరస్ ప్రభావంతో పనులు చేయించుకునే వారు కూడా తక్కువ సంఖ్యలో కొవిడ్ నిబంధనల ప్రకారం తీసుకువెళ్తుండడంతో మిగతా వారికి పనిలేకుండా పోతుంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలపై వైరస్ పెద్ద దెబ్బే కొడుతోంది.
వైరస్ ఎపుడు, ఎలా సోకుతుందోనన్న భయం..
ప్రస్తుతం అందరిలో వైరస్ ఎపుడు, ఎలా సోకుతుందోనన్న భయం నెలకొంది. ఈ భయంతో సగం అనారోగ్యానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు వైరస్ సోకిన వారు కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవడం వలన కూడా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. టెస్ట్ లకు ఆలస్యం కావడంతో అనుమానితులు బయట తిరగడంతో కూడా పాజిటివ్ ల సంఖ్య ఎక్కువుగా రావడానికి కారణమని తెలుస్తోంది. మొత్తానికి వైరస్ పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా సోకుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంటగలుస్తున్న మానవత్వం..ప్రతి మరణానికి కరోనా భ్రమ..
మానవత్వం మంటగలుస్తుంది..కరోనాపై ఏరోజుకారోజు అపోహలు పెరగడంతో పాటు వైరస్ పై అవగాహన తగ్గడంతో లేనిపోని భ్రమలతో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రజల్లో అపోహలు పెరగడంతో సాధారణంగా మరణించిన వారికి కూడా కరోనాను ఆపాదిస్తుండడంతో ఆ కుటుంబం మానసికంగా కుంగిపోతున్న పరిస్థితి. వైరస్ పట్ల చదువుకున్న వారు, చుదువుకోని వారు ఒకే రకమైన ఆలోచనతో ఉండడంతో మానవత్వం సజీవ దహనం అవుతోంది. దీనికి నిదర్శనమే చనిపోయిన భార్యను.. భర్త తన భుజాలపై మోసుకెళ్లిన ఘటన. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి అందరికి తెలిసింది..కానీ ఇలాంటి వెలుగులోకి రాని చీకటి ఘటనలు చాలానే ఉన్నాయి. పల్లెల్లోని వారికి కొవిడ్ వస్తే వారిని ఎక్కడో దూరంగా ఉంచి అంటరాని వారిగా చూస్తున్న పరిస్థితులు దాపురించాయి. కరోనా వచ్చిందని తెలియగానే ఎవరికి వారే తలుపులు మూసుకుని..అటువైపు కన్నెత్తి కూడా చూడని అద్వాన్న స్థితిలోకి చేరారు జనం.
కొవిడ్ వచ్చిన వ్యక్తులు మాస్క్ పెట్టుకుని ఇంట్లోనే కొన్ని మీటర్ల దూరంలో ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ధైర్యం కోల్పోయి..లేనిపోని అపోహలతో అనారోగ్యం భారిన పడుతున్నారు. దీంతో సాధారణ మరణానికి కూడా కరోనా పేరు పెట్టి ఆ కుటుంబానికి ఎలాంటి సాయం కూడా చేయని పరిస్థితులు ఏర్పడ్డాయి.
అందరిలో లాక్ డౌన్ చర్చే..పెడితే ఆకలి చావులు, పెట్టకపోతే కరోనా మరణాలు..
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవ్వరి నోట విన్నా లాక్ డౌన్ చర్చే..అయితే కొంతమందికి లాక్ డౌన్ పెట్టకపోతే కరోనాతో చనిపోతామన్న భయం ఉండగా, మరికొందరిలో మాత్రం లాక్ డౌన్ పెడితే ఆకలిచావులతో మరణిస్తామని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒక్క కరోనా ఎన్నో రకాల సమస్యలను సృష్టించింది. ప్రస్తుత మహమ్మారి సమయంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకువెళ్లాలన్న ఆలోచనలో పడ్డాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
ఒకవేళ లాక్ డౌన్ పెట్టాల్సి వస్తే ఆకలిచావులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే కనుక దానికి సరైన పరిష్కారం చూపాల్సిఉంది. లేకపోతే గత చేదు అనుభవాలను మళ్లొకసారి అనుభవించాల్సిందే. అయితే గత పరిస్థితులను అనుభవించడం కంటే చావే మేలన్నట్టు అభిప్రాయపడుతున్నారు ప్రజలు. కొవిడ్ మొదటి వ్యాప్తిలో వందల కిలోమీటర్లు తిండి, నీళ్లు లేకుండా నడిచిన జనం.. ఈసారి ఆ పరిస్థితులు రాకముందే వారి స్వస్థలాకు చేరుకోవడం గమనార్హం. వైరస్ రాకతో ప్రజలు ఎప్పుడు..ఏమౌతుందననే ఆలోచనలో దినదిన గండం నూరేళ్లాయుషులా మారిందంటూ చర్చించుకుంటున్నారు.