హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాకతీయ నిర్మాణ శైలికి ఆధునికత జోడించి నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అద్భుతం సృష్టించనుంది. బాహుబలి మోటర్లకు మించిన మోటర్లతో ఎత్తిపోతలు చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేక సంచలనాలకు కేంద్రం కానుంది. గిరులను హద్దులుగా చేసి, సొరంగాలనుంచి ఈదుకుంటూ పారే నీటితో 12లక్షల 30వేల లక్షల ఎకరాలకు సాగునీరు. ఒకవేయి 226 గ్రామాల్లోని వేయి 546 చెరువులు కుంటలను నింపి పాలమూరును సస్యశ్యామలం చేస్తూ నల్గొండ ప్లోరైడ్ బాధితులకు కృష్ణా జలాలు గొంతు తడపనున్నాయి. 11 జూన్ 2015 లో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో సీఎం కేసీఆర్ శంకు స్థాపన చేసినప్పటికీ ఏపీ అభ్యంతరాలతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు సుప్రీంకోర్టు జోక్యంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి.
ఈ ప్రాజెక్టు మొదటి దశలో పంపుహౌస్, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు, జర్జ్‌పూల్ నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో ప్రారంభొత్సవానికి సిద్ధం చేస్తూ ఇంజనీరింగ్ నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. నార్లాపూర్ లోని ఆంజనగిరి, ఏదులలోని వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరువెన కురుమూర్తి, ఉద్దండపూర్ లోని ఉద్దండపూర్ జలాశయాలను 18 ప్యాకేజీల ద్వారా పనులు జరుగుతున్నాయి.
ప్రాజెక్టు నిర్మాణం లో అతిముఖ్యమైన సర్జ్ పూల్(కెవిన్) నిర్మాణాలు చరిత్ర సృష్టించనున్నాయి. ఏదుల భూభాగంలో నిర్మిస్తున్న సర్జ్ పూల్ వెడల్పు 31మీటర్లు కాగా పొడవు 360 మీటర్లుగా నిర్మిస్తున్నారు. ఈ సర్జిపూల్ ఆసియా ఖండంలో అతిపెద్ద కెవిన్ గా గుర్తింపు లభించనుందని సీఎం కార్యాలయ అధికారులు చెప్పారు. అలాగే రిజర్వాయర్ భూభాగాలను కలుపుతూ దట్టమైన నల్లమల అటవీలోని గుట్టల కింది నుంచి 62.21 కిలోమీటర్ల భారీ సొరంగమార్గం నిర్మాణం చివరిదశలో ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సొరంగం జలాశయాలకు అనుసంధానం కానుంది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అమర్చుతున్న మోటర్లు కాళేశ్వరం బాహుబలిమోటర్లకు మించినవికావడంతో ఇంజనీర్లు రాత్రింభవళ్లు శ్రమిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంపుహౌస్ కు 139 మెగావాట్ల సామర్ధ్యం బిగించిన మోటర్లు అతిపెద్దవిగా, బాహుబలి మోటర్లుగా ప్రసిద్ధి చెందాయి. అయితే అంతకు మించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో 145 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మోటర్లను బిగిస్తూ ఇంజనీర్లు కాళేశ్వరం ఖ్యాతికి మించిన మోటర్లను బిగిస్తున్నారు నార్లపూర్ నుంచి ఉద్దండపూర్ రిజర్వాయర్లకు 145 మెగావాట్ల 34 మోటర్లను బిగిస్తున్నారు. ఈ మోటర్లను బీహెచ్ ఈఎల్ ప్రభుత్వ రంగ సంస్థ తయారుచేస్తోంది. అలాగే పంపు హౌజ్ లకు విద్యుత్ సరఫరా చేసేందుకు మూడు 400/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
గడవులోగా పూర్తి చేస్తాం..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని సంబంధిత ఈఎన్సీ హమీద్ ఖాన్ చెప్పారు. ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఎదుల, వట్టెం పంప్ హౌస్ ల నిర్మాణం లో 4 చొప్పున మోటర్ల బిగింపు పూర్తి అయింది. నార్లాపూర్ పంపు హౌజ్ నిర్మాణం పూర్తి కాగా మోటర్లను బిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి చేసి మొదటి దశలో తాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు.