Tuesday, December 10, 2024

TG | హోంగార్డులకు భారీగా జీతాలు పెంపు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజా పాలన- విజయోత్సవ వేడుకల సందర్భంగా రేవంత్ రెడ్డి ఈరోజు మరో శుభవార్త చెప్పారు. హోంశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా హోంగార్డులకు రేవంత్‌రెడ్డి శుభవార్త అందించారు.

తెలంగాణ హోంగార్డుల జీతాలు పెంచినట్లు సీఎం శుభవార్త చెప్పారు. హోంగార్డుల రోజువారీ భత్యాన్ని రూ.920 నుంచి రూ.1000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వీక్లీ పరేడ్ అలవెన్సులను రూ.100 నుంచి రూ.200కి పెంచుతున్నట్లు తెలిపారు. పెరిగిన ఈ వేతనాలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

అలాగే హోంగార్డులు విధి నిర్వాహణలో ప్రాణాలర్పిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. అంతేకాకుండా వారికి హెల్త్ కార్డ్ లు కూడా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కొత్త సంవత్సరంలో నూతన ఆదేశాలు అమలవుతాయని సీఎం అన్నారు.

పోలీస్ కుటుంబాల పిల్లల చదువుల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, అందుకు 50 ఎకరాలలో స్కూల్ నిర్మించడం జరుగుతుందని, హోం గార్డ్ నుండి డీజీపీ స్థాయి అధికారి పిల్లలకు ఉచిత విద్యను కార్పొరేట్ స్థాయిలో అందిస్తామని సీఎం వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో సుమారు 94 వేల మంది పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి ఉత్తమ విధులతోనే రాష్ట్రం శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పుడూ ముందంజలో ఉందని సీఎం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement