Saturday, November 23, 2024

ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌తో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం.. ఈనెల 31తో ముగుస్తున్న గడువు

  • ఇప్పటి వరకు 1.2 కోట్ల చలాన్లు క్లియర్‌
  • ఖజానాకు రూ.112.98 కోట్ల ఆదాయం
  • మరో రూ100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌తో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్‌లోని మూడు (ట్రై) పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌కు ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు పెద్దఎత్తున వినియోగించుకుంటున్నారు. ఈనెల 1వ తేదీనుంచి 20వ తేదీ వరకు సుమారు 1.2 కోట్ల పెండింగ్‌ చలాన్ల ద్వారా ఖజానాకు రూ.112.98 కోట్లు జమ అయ్యాయి. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో 63 లక్షల చలాన్లు క్లియర్‌ కాగా వీటి ద్వారా రూ.49.6 కోట్లు వాహనదారులు చెల్లించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో 38 లక్షల చలాన్లు క్లియర్‌ కాగా రూ.45.8 కోట్ల ఆదాయం వచ్చింది.

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 16 లక్షల చలాన్లకుగానూ రూ.15.3 కోట్లు ఆదాయం సమకూరింది. ట్రాఫిక్‌ పోలీసులు ఇచ్చిన రాయితీలు ఈనెల 31 వరకు కొనసాగనుండగా వాహనదారులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు ద్విచక్ర, కార్లు, ఇతర వాహనాలను నిలిపి వాటిపై ఉన్న పెండింగ్‌ చలాన్లను చెల్లించారా, లేదా అన్నది తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పోలీసులు వాహనదారులను కోరుతున్నారు. మరో ఎనిమిది రోజులపాటు వాహనదారులు చెల్లించే ఫైన్‌కు గడువు ఉండగా ప్రభుత్వ ఖజానాకు మరో రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ రాయితీ గడువును పొడిగించేది లేదని త్వరితగతిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement