Saturday, November 23, 2024

బిహార్‌ భూగర్భ జలాల్లో భారీగా యురేనియం.. తాజా అధ్యయనంలో వెల్లడి

బీహార్‌లోని అనేక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో అత్యధిక పరిమాణంలో యురేనియం ధాతువు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. ప్రత్యేకించి తాగేందుకు వాడుతున్న భూగర్భ జలాలు ప్రాణాంతకమని అభిప్రాయపడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సేకరించిన 100 నమూనాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. తదుపరి పరిశీలన కోసం లక్నోలోని సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డుకు పంపినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిలో యురేనియం పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, అది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, సీజీడబ్ల్యూబీ రీజనల్‌ డైరక్టర్‌ థాకూర్‌ బ్రహ్మానంద్‌ సింగ్‌ తెలిపారు. ఐసోటోపిక్‌ పరీక్షల కోసం ఆ నమూనాలను పంపామని, ఆ ఫలితాలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నలందా, నవడ, కటియార్‌, మధేపుర, వైశాలి, సుపాల్‌, ఔరంగాబాద్‌, గయ, శరణ్‌, జెహానాబాద్‌ జిల్లాలనుంచి ఈ నమూనాలను తీసుకువచ్చామని ఆయన వివరించారు.

జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో బీహార్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో తాగునీటిలో యురేనియం పరిమాణంపై సర్వే చేసినట్లు ఆయన తెలిపారు. తాగునీటిలో యురేనియం ఎంత ఉండాలన్న దానిపై జాతీయ ప్రమాణం ఏదీ లేదు. అయితే, ప్రపంచ ఆరోగ్యం సంస్థమాత్రం లీటర్‌కు 30 యూజీ మాత్రమే ఉండాలని పేర్కొంది. కాగా బీహార్‌ జలాల్లో అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా యురేనియం ఉంది. 2019-20 మధ్య కాలంలో సీజీడబ్ల్యుబీ దేశం మొత్తం మీద 14,337 నమూనాలు సేకరించింది. వాటిలో బీహార్‌లో 634 శాంపిల్స్‌ ను విశ్లేషించగా అన్నింటిలోనూ అత్యధిక స్థాయిలో యురేనియం ఉన్నట్లు గుర్తించారు. ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని ఎముకలు విషతుల్యమవుతాయని, కేన్సర్‌ ముప్పు ఏర్పడుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement