Tuesday, November 19, 2024

Big story | దేవాలయాల్లో భారీగా బంగారం నిల్వలు.. నగదుగా మార్చుకోవాలని దేవాదాయ శాఖ యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని దేవాలయాల్లో భారీగా ఉన్న బంగారం, వెండి నిల్వలను నగదుగా మార్చుకోవాలని దేవాదాయ శాఖ యోచిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఉపయోగించకుండా ఉన్న బంగారం, వెండి నిల్వలను నగదుగా మార్చుకోవడం ద్వారా ఆలయాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఉపయోగించకుండా ఉన్న వెండి 8 వేల కిలోలుగా లెక్క తేలింది. అలాగే, బంగారం దాదాపు వెయ్యి కిలోలుగా ఉంటుందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్‌జేసీ కేడర్‌లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ దేవాలయాల్లోనే రెండు కలిపి దాదాపు 4 వేల కిలోలున్నట్లు గుర్తించారు.

మూలవిరాట్టులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరణ, పూజాధికాలకు వాడే వెండి, ఆలయ తాపడాలకు ఉన్నది కాకుండా భక్తులు కానుకలుగా హుండీలో వేసి వెండిని మాత్రమే పరిగణనలోనికి తీసుకున్నారు. కానుకలుగా వచ్చిన వాటిలో ఉపయోగించుకునే వస్తువులుగా ఉన్నది పోను మిగిలిన ముక్కలకు సంబంధించిన నిల్వలపై లెక్క తీయగా, మొత్తం 8 వేల కిలోలుగా ఖరారు చేశారు. దాని విలువకు సమానమైన నగదును పొంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కింద జమ చేసేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన దేవాలయాల్లో ప్రతీ ఏటా ఉత్సవాల నిర్వహణకు భారీగా ఖర్చు వస్తోంది.

- Advertisement -

ఇందుకు ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్నే ఖర్చు చేస్తున్నారు. దీనికి బదులుగా బంగారం, వెండి నిల్వలుగా మార్చుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే ఆ నగదుతోనే ఉత్సవాలు నిర్వహించవచ్చన్న ఆలోచనలు దేవాదాయ శాఖ ఉంది. అయితే, కనీసం వంద కిలోలకు పైగా ఉన్న దేవాలయాలనే దేవాదాయ శాఖ గుర్తించింది. కాగా దేవాలయాల్లో ఉన్న 8 వేల కిలోల వెండిని ఫైన్‌ సిల్వర్‌గా మార్చేందుకు చర్లపల్లిలోని మింట్‌తో దేవాదాయ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఇప్పటికే మింట్‌కు ఒప్పందం ఉంది.

అదే పద్దతిలో తెలంగాణ దేవాదాయ శాఖ సైతం వెండిని కరిగించి మేలిమిగా మార్చి దాని విలువకు తగ్గ విధంగా నగదును మార్చుకునేందుకు యోచిస్తోంది. మరోవైపు, భక్తుల ద్వారా దేవాదాయ శాఖకు సమకూరిన బంగారాన్ని స్టేట్‌ బ్యాంకులో గోల్డ్‌ డిపాజిట్‌ పథకంలో ఉంచనున్నారు. ఇలా చేయడం వల్ల ప్రస్తుతం బంగారానికి చేయిస్తున్న బీమా ఖర్చు తగ్గిపోనుంది. ఇక అదే సమయంలో స్టేట్‌ బ్యాంకు నుంచి వచ్చిన వడ్డీని దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు వినియోగించనున్నట్లు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement