Tuesday, November 26, 2024

డిగ్రీ ఢమాల్‌! భారీగా తగ్గిన దరఖాస్తులు.. వలస బాటలో వేల మంది విద్యార్థులు

ఎన్‌టీఆర్‌ , ప్రభన్యూస్‌ బ్యూరో : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా బాగా తగ్గిపోయింది. ఉన్నత విద్యలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్న తరుణంలో సాధారణ డిగ్రీ విద్య పట్ల విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లింది. అడ్మిషన్ల ప్రక్రియ రెండు నెలల నుంచి కొనసాగుతూనే ఉండటం, ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 10 వరకూ కొనసాగింది. అందులో 1,42,963 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 1,39,055 మంది ఫీజులు చెల్లించారు. గతేడాది 3.2లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 2.4 లక్షల మంది అడ్మిషన్లు పొంది కోర్సుల్లో చేరారు. అంటే గతేడాది అడ్మిషన్లకు, ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌కు ఏకంగా లక్ష తేడా వచ్చింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారంతా కోర్సుల్లో చేరే అవకాశం ఉండదు. కనీసం 20వేల మంది దూరమైనా డిగ్రీ అడ్మిషన్లు 1.2 లక్షల వద్దనే ఆగిపోతాయి. ఎలా చూసినా గతేడాది కంటే ఏకంగా లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ కోర్సులకు దూరమవడం ఉన్నత విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని 158 ప్రభుత్వ, 1,200కు పైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సుమారు 3.5 లక్షలకు పైగా సీట్లు ఉన్నాయి. గతేడాది వరకూ భారీగానే అడ్మిషన్లు ఉన్నా ఈ ఏడాది ఒక్కసారిగా పడిపోయాయి. గతేడాది ఇంటర్‌లో అందరినీ ఉత్తీర్ణులు చేయడంతో అడ్మిషన్లు ఎక్కువగా వచ్చాయని, అందుకే ఈ సంవత్సరం తక్కువగా కనిపిస్తున్నాయని ఉన్నత విద్యాశాఖ వాదిస్తోంది. కానీ కరోనా లేని 2019-20లోనూ 2.15 లక్షల మంది డిగ్రీలో అడ్మిషన్లు పొందారు. సాధారణంగా ఏటా అడ్మిషన్ల సంఖ్యలో వృద్ధి ఉంటు-ంది. ఈ ఏడాది మాత్రం దారుణంగా పడిపోయింది. రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌లో ఇంకొంతమంది వస్తారనే వాదన ఉన్నా 90శాతానికి పైగా సీట్లు తొలి విడతలోనే భర్తీ అవుతాయని అధికారులే చెబుతున్నారు.

19 నుంచి వెబ్‌ ఆప్షన్లు?

ఏటా సెప్టెంబరు నాటికే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అందుకు అనుగుణంగా యూనివర్సిటీ-లు ముందస్తు చర్యలు చేపడతాయి. కానీ ఈ సంవత్సరం అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ జాప్యం ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్లపై పడింది. ఇప్పటికీ వెబ్‌ ఆప్షన్ల తేదీలపై స్పష్టత రాలేదు. ఈ నెల 19 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఉండొచ్చని అధికార వర్గాలు అంటున్నాయి.

పొరుగు రాష్ట్రాలకు పయనం

- Advertisement -

డిగ్రీ కోర్సులకు దూరమైన విద్యార్థులు ఇంజనీరింగ్‌ వైపు మళ్లారనే వాదన ఉంది. ఈ ఏడాది ఇంజనీరింగ్‌కు 15వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇటు డిగ్రీకి, అటు ఇంజనీరింగ్‌కు రాని 80వేల మంది విద్యార్థులు ఎటెళ్లారనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అర్హులను పెంచేందుకు ఇంటర్‌ మార్కుల విషయంలో అనేక మినహాయింపులు ఇవ్వడం వల్ల కూడా డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు తగ్గినట్లు అధికార వర్గాలు అంటున్నాయి. అయితే డిగ్రీతో పాటు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో జాప్యంతో చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారనే అభిప్రాయాలున్నాయి. దీనికి తగినట్లుగానే సరిహద్దు రాష్ట్రాల యూనివర్సిటీలు, ప్రైవేటు వర్సిటీల్లో చేరికలు బాగా పెరిగాయి.

ఆన్‌లైన్‌ అడ్మిషన్లూ కారణమే

డిగ్రీ కోర్సుల్లో రిజర్వేషన్ల అమలు కోసం 2020-21 నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం తెచ్చారు. ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్ల ద్వారా సీట్లు కేటాయుస్తున్నారు. దీంతో అందరికీ కోరుకున్న సీట్లు రావట్లేదు. కాలేజీలు పక్కనే ఉన్నా కొందరికి దూరంగా సీట్లు లభిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటాలో ఫీజులు రెండురెట్లు అదనంగా ఉండటంతో డిగ్రీ కోర్సులకు అంత ఖర్చు చేయడం ఎందుకనే ధోరణితో కొందరు ఇంజనీరింగ్‌ వైపు మొగ్గుతున్నారు. మాన్యువల్‌ అడ్మిషన్లు తీసుకున్నప్పుడు వచ్చిన స్థాయిలో విద్యార్థుల సంఖ్య ఇప్పుడు కనిపించడం లేదు. ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గడానికి ఇంటర్‌ ఉత్తీర్ణత దారుణంగా పడిపోవడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ పెద్దగా పురోగతి లేకపోవడంతో చాలామంది చదువులకు దూరమయ్యారు. గత రెండేళ్లుగా పరీక్షలు లేకపోవడం, ఇప్పుడు నాణ్యత పేరుతో ఒకేసారి కఠిన నిబంధనలు తేవడంతో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది.

కాలేజీలపై రీవెరిఫికేషన్‌ కత్తి

ఇప్పటికే అడ్మిషన్లు ఆలస్యం కాగా ఇప్పుడు కాలేజీలపై రీవెరిఫికేషన్‌ చేస్తున్నారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. తనిఖీల్లో ప్రమాణాలు పాటించడం లేదని వెలుగులోకి రావడంతో 100కు పైగా కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేయాలని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంతకాలం లేని ప్రమాణాల గురించి ఇప్పుడు అకస్మాత్తుగా పట్టించుకోవడంపై కాలేజీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ముందుగానే తనిఖీలు చేపట్టి ప్రమాణాలు లేవని తేలిస్తే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేదని, ఇప్పుడు అడ్మిషన్లు ఆపేస్తామంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement