Tuesday, November 26, 2024

ఎన్ఐపీ కింద తెలంగాణలో భారీ ప్రాజెక్టులు.. ఓటీఎస్ కింద 60,940 కోట్లు వ‌సూలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో నాన్ ప‌ర్ఫామింగ్ అసెట్స్‌(ఎన్పీఏ)ల‌కు వ‌న్‌టైం సెటిల్‌మెంట్ కింద సుమారు రూ. 60,940 కోట్లు వ‌సూలైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్ర‌భుత్వ రంగంలోని బ్యాంకుల్లో లోన్ల రాబ‌డికి వ‌న్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల ద్వారా ఎంత మొత్తం వసూలైందని లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వ‌రరావు ప్ర‌శ్నించగా… ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి భ‌గ‌వ‌త్ క‌రాడ్ సమాధానమిచ్చారు. బ్యాంకింగ్ కంపెనీస్ చ‌ట్టం సెక్ష‌న్ 13 ప్ర‌కారం ఆయా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారి వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. అత్య‌ధికంగా బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, అత్య‌ల్పంగా యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ‌న్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ఎన్పీఏల‌ను ప‌రిష్క‌రించుకున్న‌ట్టు ఆయన వివ‌రించారు.

ఎన్ఐపీ కింద తెలంగాణాలో భారీ ప్రాజెక్టులు
నేష‌న‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ పైప్‌లైన్‌(ఎన్ఐపీ) కింద దేశ‌వ్యాప్తంగా 9,335 ప్రాజెక్టులు చేపడుతున్ననట్టు కేంద్రం తెలిపింది. ఎన్‌ఐపీ కింద తెలంగాణాలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టులెన్ని అని నామా అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి లిఖిత‌పూర్వ‌క‌ స‌మాధానమిచ్చారు. ఇటువంటి ప్రాజెక్టు నిర్వ‌హించ‌డం కేంద్రానికి తొలిసారి అని చెప్పారు. మొదట్లో 6,835 ప్రాజెక్టులు మాత్ర‌మే చేప‌ట్టాల‌ని భావించినా తర్వాత ఆ సంఖ్యను పెంచామన్నారు. అయితే, ఈ లిస్టులో రానున్న రోజుల్లో మార్పులు జ‌రిగే అవ‌కాశముంద‌ని వివ‌రించారు. 2020-25 వ‌ర‌కు చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌పై ఒక ప్ర‌ణాళిక వేసుకున్నామ‌ని, అందులో తెలంగాణకు ఎన్ఐపీ కింద 217 ప్రాజెక్టుల‌కు గానూ రూ. 2,90,939 కోట్లు ఇవ్వాల‌ని నిర్ధారించిన‌ట్టు తెలిపారు. అయితే అందుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement