Friday, November 22, 2024

Delhi | విశాఖ షిప్‌యార్డ్‌కు భారీ ఆర్డర్.. 5 ఫ్లీట్ సపోర్ట్ నౌకలు ఆర్డర్ చేసిన రక్షణశాఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు భారీ ఆర్డర్ కైవసం చేసుకుంది. రూ. 19వేల కోట్ల విలువైన కాంట్రాక్టు అప్పగిస్తూ రక్షణశాఖ సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం నావికాదళం అవసరాల కోసం ఐదు భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది. సముద్రంలో ఆపరేషన్లలో ఉన్న యుద్ధ నౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, ఆయుధాలు, స్టోర్ పరికరాలు, ఆహారం అందించేందుకు ఈ నౌకలు ఉపయోగపడనున్నాయి. ఆగస్టు 16న జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నావికాదళాన్ని పటిష్టం చేసే క్రమంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కొక్కటి 44,000 టన్నుల బరువుతో ఉండేలా నౌక డిజైన్లు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒప్పందం ప్రకారం వీటిని 8 ఏళ్లలో నిర్మించి రక్షణశాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద నౌకలను భారత్‌లో నిర్మించడం ఇదే తొలిసారి. ఇంత భారీ నౌకల నిర్మాణానికి హిందుస్థాన్ షిప్‌యార్డ్ సిద్ధమవుతోంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగానే వీటిని నిర్మించే సంస్థకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్డర్ కారణంగా నౌకా నిర్మాణం రంగంతో పాటు నౌకా నిర్మాణంలో అనుబంధ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కలుగుతాయని కేంద్రం చెబుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement