భారత విమానయాన రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. మొదటిసారిగా ఐఏటీఏ గవర్నింగ్ బోర్డులో ఇండియాకు చెందిన రెండు ఏయిర్‌లైన్స్ సీఈవోలు సభ్యులుగా ఉన్నారని తెలిపింది. ఇది భారత విమానాయన రంగంలో పెరుగుతున్న అవకాశాలకు నిదర్శనమని ఐఏటీఏ డైరెక్టర్ జన రల్ విల్లిd వాల్స్ చెప్పారు. భారత దేశ విమానయాన రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్ పై తాము ఎంతో ఆశజనంగా ఉన్నామని ఐఏటీఏ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
ఐఏటీఏలో ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కాంబెల్ విల్సన్, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తో పాటు 31 ఎయిర్‌లైన్స్‌కు చెందిన సీఈఓలు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌గా ఉన్నారు. 2024 జూన్ నుంచి పీటర్ ఎల్బర్స్ ఐఏటీఏ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఇండియా ఏవియేషన్ మార్కెట్ విస్తరిస్తున్నట్లు ఐఏటీఏ తెలిపింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయని, పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయని తెలిపింది.
దేశీయంగా 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 5.04 కోట్ల మంది విమాన ప్రయాణికులు ప్రయాణించారు. గత సంవత్సరం ఇదే కాలంలో 3.53 కోట్ల మంది విమాన ప్రయాణికులు నమోదయ్యారని పేర్కొంది. ప్రయాణికుల వార్షిక పెరుగుదల 42.88 శాతంగా ఉందని తెలిపింది. పన్నులు, విమానాశ్రయ ఛార్జీలు వంటి కారణాల వల్ల విమాన ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని విల్లే వాల్స్ చెప్పారు.
ప్రభుత్వం నిర్ధేశించిన నెట్ జీరో ఉద్గారాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) నిరంతరం గైడ్ చేస్తుందన్నారు. 2050 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి కార్బన్ అండ్ సస్టెనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ (ఎస్ఏఎఫ్) వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. భారత ఏవియేషన్ రంగం ఈ విషయంలో క్రమంగా లక్ష్యంపైగా తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.