దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్‌లో దేశీయంగా విమానాల్లో 1.29 కోట్ల మంది ప్రయాణించారు. 2022 ఏప్రిల్‌లో 1.05 కోట్ల మంది విమాన ప్రయాణికులు నమోదయ్యారు. గత సంవత్సరం ఏప్రిల్‌లో ప్రయాణించి వారికంటే ఈ సారి ఏప్రిల్‌లో ఈ సంఖ్య 22 శాతం పెరిగిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఈ సంవత్సరం మార్చిలో 1.28 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని తెలిపింది. దీంతో పోల్చితే ఏప్రిల్‌లో ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది.
అగ్రస్థానంలో ఇండిగో..
విమాన ప్రయాణిల విషయంలో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో ఇండిగో మార్కెట్ వాటా 56.8 నుంచి 57.5 శాతానికి పెరిగింది. ఎయిర్ ఇండియా వాటా 8.8 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది. విస్తారా వాటా 8.9 శాతం నుంచి 8.7 శాతానికి, స్పైస్ జెట్ వాటా 6.4 శాతం నుంచి 5.8 శాతానికి గోఫస్ట్ వాటా 6.9 నుంచి 6.4 శాతానికి తగ్గింది. ఎయిర్‌ఏషియా ఇండియా ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్ మార్కెట్ వాటా ఎలాంటి మార్పు లేకుండా 7.6 శాతంగా కొనసాగింది. ఆకాశ్ ఎయిర్ మార్కెట్ వాటా 3.3 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది.
విమాన సర్వీస్‌లను సమయానికి నడిపించే విషయంలో ఆకాశ ఎయిర్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ విమనాలు 94 శాతం నిర్ణీత సమయంంలో రాకపోకలు సాగించాయి. దీని తరువాత స్థానంలో ఎయిర్ ఇండియా సర్వీస్‌లు 91.1 శాతం, ఇండిగో సర్వీస్‌లు 89.6 శాతం సమయ పాలన పాటించాయి. ఈ నెల 3 నుంచి విమానాలను రద్దు చేసిన గోఫస్ట్ సమయ పాలన అత్యంత తక్కువగా 41.7 శాతంగా నమోదైంది.
ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు విమానాల్లో 5.04 కోట్ల మంది ప్రయాణించారు. గత సంవత్సరం ఇదే కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 3.53 కోట్లుగా ఉందని డీజీసీఏ తెలిపింది. గత సంవత్సరంతో పోల్చితే విమాన ప్రయాణికుల సంఖ్య 42.88 శాతం వృద్ధిని నమోదయ్యింది. కోవిడ్ తరువాత క్రమంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.