ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పేరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థలకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంయుక్తంగా 2,748 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఈ సంస్థలు సంయుక్తంగా నష్టాలు 21,201.18 కోట్లకు చేరాయి. ఏడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెటింగ్ మార్జిన్లు తగ్గి నష్టాలు వచ్చాయి. దేశంలో రాయితీపై విక్రయిస్తున్న ఎల్‌పీజీ వల్ల వస్తున్న నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత నెల 12వ తేదీన గ్రాంట్ కింద చమురు సంస్థలకు 22 వేల కోట్లు కేటాయించింది.
అయినప్పటికీ నష్టాలు తప్పలేదు. ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వకుంటే ఈ నష్టాలు మరింత ఎక్కువగా నమోదైయ్యేవని చమురు సంస్థలు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలకు పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రతి రోజూ సవరించుకునే వెసులుబాటు ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆదేశం మేరకు చమురు సంస్థలు ఏడు నెలలుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను సవరించడంలేదు. అక్టోబర్ 29న రెండో త్రౖౖెమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఐఓసీ 272.35 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. హెచ్‌పీసీఎల్ సెప్టెంబర్ త్రైమాసికంలో 2,172.14 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది.
బీపీసీఎల్‌కు రెండో త్రైమాసికంలో 304.17 కోట్ల నష్టాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు 21,201.18 కోట్ల నష్టాలు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉన్న సమయంలోనూ ఈ స్థాయిలో కంపెనీలకు నష్టాలు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన 22 వేల గ్రాంట్‌లో ఐఓసీకి 10,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు 5,617 కోట్లు, బీపీసీఎల్‌కు 5,582 కోట్లు అందాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో దేశంలో ధరలు పెరుగుతున్నాయి.
ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యానికి అగుణంగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలేదని, దీని వల్ల వస్తున్న నష్టాలను భర్తీ చేసే విషయం ఆర్ధిక శాఖతో చర్చిస్తున్నామని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. మరో వైపు ప్రైవేట్ చమురు సంస్థలు రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేసి, విదేశాలకు ఎక్కకువ రేటుకు అమ్ముడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించాయి. దీంతో ప్రభుత్వం ఎగుమతులపై పన్నులు పెంచింది. ప్రభుత్వం రంగ సంస్థలకు ఎలాంటి వెసులుబాటు కల్పించకపోవడంతో ఈ సంస్థల నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి.