Tuesday, November 26, 2024

ప్రభుత్వ పెట్రో సంస్థలకు భారీ నష్టాలు.. తొలి త్రైమాసికంలో రూ.18 వేల కోట్ల నష్టం

దేశంలో పేరుమోసిన ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ మూడు సంస్థలకు కలపి ఏకంగా రూ.18,480 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పెట్రో ధరల నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు కానీ, ప్రస్తు రోజువారీ విధానంలోగానీ ఇంత స్థాయిలో ఎప్పుడూ నష్టాలు రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా డీజెల్‌, పెట్రోల్‌ ధరలు పెంచకపోవడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌లపై వచ్చే మార్జిన్‌ గణనీయంగా తగ్గిపోవడమూ నష్టాలకు మరో కారణం. నిజానికి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను రోజువారీ విధానంలో పెంచడం, తగ్గించడం చేస్తూంటారు. కానీ గత నాలుగు నెలలుగా అలా జరగలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, దేశంలో రేట్లు పెరగకపోవడంతో నష్టాలు తప్పలేదు. వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) ధరల విషయంలోనూ ఇదే పరిస్థితి కావడంతో నష్టాల్లో దాని వాటా కూడా ఉంది. ఏప్రిల్‌ – జూన్‌ మధ్య 1995.3 కోట్ల రూపాయల నికర నష్టం వచ్చిందని ఐఓసీ పేర్కొంది.

ఇక హెచ్‌పీసీఎల్‌ ఎన్నడూ లేని రీతిలోఅత్యధికంగా రూ.10,196.94 కోట్లు, బీపీసీఎల్‌ రూ.6,290.8 కోట్లు నష్టపోయినట్లు పేర్కొన్నాయి. ఇంత నష్టాలు ఎప్పుడూ ఆయా సంస్థలు చూడలేదు. అంతర్జాతీయ మార్కెట్‌నుంచి సగటున బారెల్‌కు 109 డాలర్ల చొప్పున దిగుమతి చేసుకున్న భారత్‌ దేశీయంగా ధరలు పెంచలేదు. బారెల్‌ ముడి చమురును 85-86 డాలర్ల రేటుపై కొనుగోలు చేసినప్పుడు ఉన్న దేశీయ పెట్రో, డీజెల్‌ రేట్లనే కొనసాగించడంతో నష్టాలు వచ్చాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి. పెట్రో, డీజిల్‌ రేట్లను అంతర్జాతీయ మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా రోజువారీ సమీక్షల అనంతరం పెంచాలా, తగ్గించాలా అన్నదానిపై పెట్రో సంస్థలకే ప్రభుత్వం అధికారం ఇచ్చింది. కానీఏప్రిల్‌లో ధరల పెంపుపై ఆంక్షలు విధించింది.123 రోజులపాటు ధరలు పెంచని ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల అనంతరం, మార్చిలో మళ్లి పెట్రో ధరలు పెంచిన విషయం తెలిసిందే. కాగా పెట్రోల్‌, డీజిల్‌ను లీటర్‌పై సగటున 12-14 రూపాయల మేర నష్టపోయినట్లు ఆయా సంస్థలు తెలిపాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement