Friday, November 22, 2024

TG | ఫార్మా కంపెనీల భారీ పెట్టుబ‌డులు… 12,490 మందికి ఉపాది !

దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతోపాటు.. కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మేర‌కు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, టీఎస్ఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ఆరు కంపెనీలు కలిసి దాదాపు రూ.5260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది.

ఎంవోయూల ఒప్పందాల ప్రకారం…

  • ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పనుంది.
  • లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి.
  • గ్లాండ్ పార్మా ఆర్ అండ్ డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపించనుంది.
  • డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది.
  • హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది.

మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఈ సమావేశంలో డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ సతీష్‌రెడ్డి, లారస్‌ ల్యాబ్స్‌ ఇడి వివి రవికుమార్‌, గ్లాండ్‌ ఫార్మా సిఇఒ శ్రీనివాస్‌, ఎంఎస్‌ ల్యాబ్స్‌ సిఎండి ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, అరబిందో డైరెక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, హెటిరో గ్రూప్‌ ఎండి బి.వంశీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement