Saturday, November 23, 2024

భారీగా పెరిగిన క్రెడిట్‌ కార్డుల వినియోగం.. 1.87 లక్షల కోట్లుగా నమోదు

దేశంలో కోవిడ్‌ తరువాత క్రెడిట్‌ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఈ సంవత్సరం జనవరిలో క్రెడిట్‌ కార్డుల ఆవుట్‌ స్టాండింగ్‌ 29.6 శాతం పెరిగింది. దీంతో క్రెడిట్‌ కార్డుల బాకీలు రికార్డ్‌ స్థాయిలో పెరిగి 1.87 లక్షల కోట్లకు చేరాయి. క్రెడిట్‌ ద్వారా చేసిన ఖర్చులను బాకీలు (అవుట్‌స్టాండింగ్‌)గా పరిగణిస్తారు. డిజిటలైెజేషన్‌ పెరగడంతో క్రెడిట్‌ ద్వారా చేస్తున్న ఖర్చు పెరుగుతోంది. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరంలో 10 నెలల కాలంలో క్రెడిట్‌ కార్డుల అవుట్‌ స్టాండింగ్‌ 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. జూన్‌ నెలలో అత్యధికంగా 30.7 శాతానికి ఇది పెరిగింది. డిజిటలైజేషన్‌ వల్లే ప్రస్తుతం ఉన్న క్రెడిట్‌ కార్డుల ద్వారా చేస్తున ఖర్చు పెరిగిందని ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల డీవిజన్‌ ఎండీ, సీఈఓ రామ్మోహన్‌ రావు అభిప్రాయపడ్డారు.

తెలిగ్గా చెల్లించేందుకు అవకాశం ఉండటంతో క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరుగుతుంది. ప్రధానంగా విద్య, యుటిలిటీ బిల్స్‌ చెల్లింపులు, ఫిట్‌నెస్‌, హెల్త్‌, షాపింగ్‌ ఇలా అనేక వాటిపై క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కొన్ని నెలలుగా క్రమంగా క్రెడిట్‌కార్డుల వినియోగం పెరుగుతూ వస్తోందని ఆయన చెప్పారు. 2022 డిసెంబర్‌ నెలలో క్రెడిట్‌ కార్డుల వినియోగం 1.26 లక్షల కోట్లగా ఉంది. జనవరి 2023 నాటికి ఇది1.28 లక్షల కోట్లకు చేరింది. గత 11 నెలలుగా క్రెడిట్‌ కార్డుల ద్వారా చేస్తున్న ఖర్చు లక్ష కోట్లకు పైగా నమోదవుతుందని ఆయన చెప్పారు. 2023 జనవరి చివరి నాటికి వివిధ బ్యాంక్‌లు 8.25 కోట్ల క్రెడిట్‌ కార్డులను జారీ చేశాయి. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డులను అత్యధికంగా జారీ చేస్తున్న టాప్‌ 5 బ్యాంక్‌లుగా ఉన్నాయి.

- Advertisement -

గతంలో మార్టిగేజ్‌ లోన్స్‌, బిజినెస్‌ లోన్స్‌ ఎక్కువగా తీసుకునేవారని, కాని ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న యువత ఎక్కువగా పర్సనల్‌ లోన్స్‌ తీసుకుంటున్నారని అండ్రోమెడా లోన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ వి.స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. వీరే ఎక్కువగా క్రెడిట్‌ కార్డులు తీసుకుంటున్నారని చెప్పారు. తమ క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవడంలోనూ వీరు ముందుంటున్నారని చెప్పారు. క్రెడిట్‌ కార్డుల ఆవుట్‌స్టాండింగ్‌ 2023 జనవరిలో 29.6 శాతంగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇది గత సంవత్సరం 10 శాతంగా ఉంది. 2022 జనవరిలో అవుట్‌ స్టాండింగ్‌ మొత్తం 1,41,254 కోట్లుగా ఉంది. ఇది 2023 జనవరి నాటికి 1,86,783 కోట్లకు పెరిగింది.

కొవిడ్‌ తరువాత వినియోగదారుల విశ్వాసం భారీగా పెరిగిందని ఆర్బీఐ ఫిబ్రవరి 8న విడుదల చేసిన సర్వే పేర్కొంది. 2022లో ఇ-కామర్స్‌లో జరిగిన లావాదేవీలలో 60 శాతం క్రెడిట్‌ కార్డుల ద్వారానే జరిగాయి. 2023లో కోవిడ్‌ ప్రభావం నుంచి ఆర్ధిక వ్యవస్థ కోలుకోవడంతో క్రమంగా వినియోగదారులు ఖర్చు చేయడం కూడా పెరుగుతోంది. ప్రధానంగా ట్రావెల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌పై పెడుతున్న ఖర్చు క్రమంగా పెరుగుతోంది. ఇది రానున్న నెలల్లో మరింతగా పెరుగుతుందని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement