దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల్లో ఖర్చులు భారీగా పెరిగాయి. ఏప్రిల్ నెలలో ఈ ఖర్చు 56 శాతం పెరిగిందని యాక్సెస్ మై ఇండియా సంస్థ నిర్వహించన సర్వేలో తేలింది. వినియోగదారుల సెంటిమెంట్ ఇండెక్స్ నెల వారి విశ్లేషణను ఈ సంస్థ చేస్తోంది. ఇలా ఖర్చులు ఎక్కువ పెరిగిన వాటిలో 70 శాతంతో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలోఉంది. దీని తరువాత స్థానాల్లో 61 శాతంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఉన్నాయి. గత నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో గృహ వినియోగంలో కన్జ్యూమర్ సెంటిమెంట్ 1 శాతం తగ్గింది. గత నెలలో 49 ప్లస్ ఉంటే, ఏప్రిల్‌లో 48 ప్లస్ ఉందని సర్వే పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 10,206 మందిని సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్లు యాక్సెస్ మై ఇండియా తెలిపింది. ఇందులో 64 శాతం మంది గ్రామీణ ప్రాంతాలు, 36 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
ప్రధానంగా గృహ సంబంధ ఐటమ్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై కుటుంబాలు 32 శాతం ఖర్చు చేశాయి. మార్చితో పోల్చుకుంటే ఇది 1 శాతం తగ్గింది. నిత్యావసర వస్తువులపై చేసే ఖర్చు 37 శాతంగా ఉంది. కర్నాటకలో కుటుంబాలు నిత్యావరసరాలపై అత్యధికంగా 45 శాతం ఖర్చు చేశాయి. నిత్యావసరం కాని వాటిపై ప్రధానంగా ఏసీలు, కార్లు, రిఫ్రిజిరేటర్లు వంటి వాటిపై ఖర్చు 5 శాతం పెరిగింది. మార్చితో పోల్చితే ఈ విషయంలో ఒక శాతం ఎక్కువగా నమోదైంది. నెలకు 30 వేలకంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలే వీటిపై ఎక్కువ ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. నిత్యావసరం కాని వాటిపై రాజస్థాన్ రాష్ట్రంలోని కుటుంబాలు ఎక్కువగా 10 శాతం ఖర్చు చేశారని సర్వే పేర్కొంది.
ఆరోగ్య సంబంధమైన వాటిపై చేసిన ఖర్చు 31 శాతంగా ఉంది. ప్రధానంగా విటమిన్స్, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారం వంటి వాటిపై కుటుంబాలు ఎక్కువ ఖర్చు చేశాయి. ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల వినియోగం 32 శాతం పెరిగాయి. 26 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిలో వీటి వినియోగం 33 శాతంగా ఉంది. టీవీ, ఇంటర్నెట్, రేడియో వంటి వాటి వినియోగం 21 శాతం పెరిగింది. మీడియా వీక్షకుల సంఖ్య మగవారిలో 22 శాతానికి పెరిగింది. ముఖ్యంగా 18-25 సంవత్సరాల వయస్సున్న వారిలో ఇది 30 శాతంగా ఉంది. కుటుంబాల్లో ప్రయాణాలు చేసే వారి సంఖ్య 7 శాతం పెరిగింది. 18-25 సంవత్సరాల వయస్సున్న వారిలో 11 శాతం మంది ప్రయాణాలు చేశారు. 26 శాతం మంది కుటుంబాలు తమ డబ్బును సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లోనే ఉంచారు. 20 శాతం మంది మాత్రం తమ సొంత, లేదా ఇతర బిజినెస్‌ల్లో పెట్టుబడిగా పెట్టారని నివేదిక పేర్కొంది. 16 శాతం మంది హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్‌ల్లో పెట్టుబడులు పెట్టారు.
13 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారని సర్వే పేర్కొంది. 8 శాతం మంది తమ సేవింగ్స్‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లుగా చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. 33 శాతం కుటుంబాలు సేవింగ్ అకౌంట్స్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. పురుషుల్లో ఎక్కువ మంది బిజినెస్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. 82 శాతం కుటుంబాలు తమ పిల్లలను మంచి స్కూల్స్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో, ప్రైవేట్ స్కూల్స్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తిగా ఉన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందిస్తే అక్కడే చేర్పిస్తామని వీరు స్పష్టం చేసినట్లు నివేదిక తెలిపింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది తమ పిల్లలు ప్రభుత్వ స్కూల్స్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. 57 శాతం మంది ప్రైవేట్ స్కూల్స్‌కు పోతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్లో 56 శాతం మంది ప్రభుత్వ స్కూల్స్‌కు పోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం 57 శాతం మంది ప్రైవేట్ స్కూల్స్‌కు పోతున్నారు. 1 శాతం మంది మాత్రమే తమ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులకు తమ పిల్లలను మంచి స్కూల్‌కు పంపించాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, వారి ఆర్ధిక పరిస్థితి అందుకు సకహరించేలా లేదు. అందుకే సర్వేలోఆసక్తి చూపినప్పటికీ, ఎక్కువ మంది తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్‌కు పంపిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో సౌకర్యాలు మెరుగుపడాలని వీరు కోరుతున్నారు. పెరుగుతున్న ధరల మూలంగా నిత్యావసరాలపై పెడుతున్న ఖర్చు పెరుగుతున్నది.