హెచ్1బి వీసాలతో సహా ఇమ్మిగ్రేషన్ రుసులము భారీగా పెంచుతూ బిడెన్ పరిపాలన యాంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రతిపాదిత నియమాల ప్రకారం, హెచ్1బి వీసా దరఖాస్తు ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరుగుతుంది. అదేవిధంగా ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1385 డాలర్లకు పెంచింది. ఒ-1 వీసాల దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1055 డాలర్లకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. హెచ్-2బి పిటిషన్‌ల రుసుము (సీజనల్, వ్యవసాయేతర కార్మికులకు) 460 డాలర్లనుంచి 1080కి పెంచబడింది. ఈ వీసా కేటగిరీలపై రుసుము పెంపుదల చట్టబద్దంగా అమెరికాలోకి ప్రవేశించాలని అనుకునే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.
పరోక్షంగా అక్రమ వలసలను పెరిగేందుకు దారితీస్తుందని భావిస్తున్నారు. 2016 నుంచి వీసా రుసుములు పెరగలేదు. కొత్త రుసుములు ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ నిర్వహణ ఖర్చులను పూర్తిగా భర్తీ చేస్తుందని యూఎస్‌సిఐఎస్ తెలిపింది. ఏజెన్సీ సాధారణంగా ద్వైవార్షిక రుసుము నియమాన్ని ప్రచురిస్తుంది. సమాఖ్య నిర్దేశిత మానవతా కార్యక్రమాల విస్తరణ, వేతనాల పెంపుదల, అదనపు సిబ్బంది అవసరాలు, ఇతర ముఖ్యమైన పెట్టుబడులకు ఈ మార్పులను ప్రతిపాదిస్తుంటుంది. ఏజెన్సీ నిర్వహణకయ్యే ఖర్చులో దాదాపు 96శాతం ఇమ్మిగ్రేషన్ రుసుముల ద్వారానే పొందుతుంది. కాంగ్రెస్ నుంచి అధికారిక కేటాయింపులు నామమాత్రంగానే ఉంటుంటాయి. 2020లో కొవిడ్ కారణంగా కొత్త దరఖాస్తుల ఆదాయం గణనీయంగా తగ్గింది.
ఫలితంగా ఆదాయంలో 40శాతం తగ్గుదల నమోదైంది. క్షీణించిన నగదు నిల్వలు, తాత్కాలిక నియామకాల స్తంభన, శ్రామికశక్తి క్షీణత, ఫిర్యాదుల పరిష్కార సామర్థ్యం సన్నగిల్లడం వంటి పరిణామాలకు విరుగుడుగా వీసా దరఖాస్తుల రుసుమును భారీగా పెంచాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్-1బి అనేది వలసేతర వీసా. ఇది అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నిపుణులు అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారత్, చైనా నుంచి ఏటా 10వేల మందిని ఈ ప్రాతిపదికన అమెరికా టెక్ కంపెనీలు నియామకాలు జరుపుతుంటాయి.