దేశంలో 5జీ సర్వీస్‌లు ప్రారంభమైన తరువాత మొబైల్ డాటా వినియోగం భారీగా పెరుగుతున్నది. ప్రధానంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా శరవేగంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. 2023 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు రిలయన్స్ జియో మొబైల్ డాటా 4 శాతం, ఎయిర్‌టెల్ డాటా వినియోగం 2.7 శాతం పెరిగింది. ప్రధానంగా 5జీ మొబైల్ కనెక్షన్లు భారీగా పెరుగుతున్నందున డాటా వినియోగం 20 శాతం కంటే ఎక్కువగా పెరుగుతుందని టెలికం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5జీ వాడకం ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి ఈ సంవత్సరం చివరినాటికి 15 శాతానికి చేరుతుందని అంచనా. 4జీ యూజర్ల కంటే 5జీ యూజర్లు రెట్టింపు డాటాను వినియోగిస్తారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ సంవత్సరం చివరి నాటికి మొబైల్ డేటా వినియోగం 20 శాతానికి పైగా పెరుగుతుందని జియో, ఎయిర్‌టెల్ అంచనా వేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు ఈ సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 5జీ సర్వీస్‌లు అందించాలని నిర్ణయించాయి. 5జీ వినియోగదారుల సంఖ్య కూడా మూడు రెట్లు పెరుగుతుందని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే 4జీ యూజర్ల కంటే 5జీ యూజర్లు 2.5 రేట్లు ఎక్కువ డాటాను వినియోగిస్తున్నారని నిపుణులు తెలిపారు. 2022 సెప్టెంబర్లో నెలవారి 22.2 జీబీగా ఉన్న డాటా వినియోగం, 2023 మార్చి నాటికి 4 శాతం పెరిగి 23.1 జీ బీగా ఉందని రిలయన్స్ జియో తెలిపింది. ఎయిర్ టెల్ కస్టమర్లు సెప్టెంబర్ 2022లో నెలకు 20.75 జీబీ డాటా వినియోగం, 2023 మార్చి నాటికి 21.3 జీబీకి పెరిగిందని కంపెనీ తెలిపింది.
రిలయన్స్ జియో ఇప్పటి వరకు 3,630 పట్టణాలు,నగరాల్లో 5జీ సర్వీస్‌లను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ 3,500 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వీస్‌లను ప్రారంభించింది. 2023 సెప్టెంబర్ నాటికి అన్ని అర్బన్ ఏరియాల్లో 5జీ సేవలు అందిస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. ఎయిర్‌టెల్, జియో రెండు టెలికమ్ కంపెనీలు కూడా డిసెంబర్ 2023 నాటికి మొత్తం దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రిలయన్స్ జియో 239 రూపాయలకు పైగా ఉన్న ప్లాన్స్ తీసుకున్న పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లకు 5జీ సేవలు అందిస్తోంది.
వేలంలో 5జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన వోడాఫోన్ ఐడియా మాత్రం ఇంత వరకు 5జీ సర్వీస్‌లను ప్రారంభించలేదు. భారీ నష్టాల్లో ఉన్న వీఐ నిధుల కొరతతో ఇంకా ఈ సర్వీస్‌లను ప్రారంభించలేకపోయింది. 5జీ మొబైల్ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున టెలికం కంపెనీలు ఆశిస్తున్న స్థాయిలో కనక్షన్లు పెరగడంలేదని ప్రముఖ విశ్లేషణ సంస ్థ క్రిసిల్ స్పష్టం చేసింది. మరో రెండు సంవత్సరాలు అత్యధికులు 4జీనే వినియోగిస్తారని, 2025 మార్చి నాటికి దేశంలో మూడోవంతు మొబైల్ యూజర్లు 5జీని వినియోగించే అవకాశం ఉందని పేర్కొంది.