Wednesday, November 20, 2024

ఐటీ ఎగుమతుల్లో భారీ వృద్ధి.. దేశంలోనే 3వ స్థానంలో తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో ఏకంగా రూ.180617 కోట్లతో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ కంటే కర్ణాటక, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలు మాత్రమే ఐటీ ఎగుమతుల్లో ముందంజలో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ 2014తో పోలిస్తే ఎగుమతులు 100 శాతానికిపైగా పెరిగి రికార్డుస్థాయిలో వృద్ధి చెందాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో గణాంకాలతో సహా వెల్లడించింది. సాప్ట్ వేర్‌ టెక్నాలజీ పార్కులు, సెజ్‌లలో ఉన్న అన్ని ఐటీ కార్యాలయాల నుంచి ఈ ఉత్పత్తులు ఎగుమతయ్యాయని తెలిపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఐటీ ఎగుమతులు రికార్డుస్థాయిలో వృద్ధి చెందాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడగానే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మీద దృష్టి సారించిన ప్రభుత్వం ఆ విషయంలో దేశంలోనే అగ్రర్యాంకులు సాధించిందని, దీంతో ఐటీ రంగంలో పెట్టుబడులు వెల్లువలా వచ్చి సహజంగానే ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఎగుమతుల్లో భారీ వద్ధితో సమానంగా ఐటీ ఉద్యోగాల్లోనూ భారీగా పెరుగుదల చోటుచేసుకొని లక్షలాది కొత్త ఉద్యోగాల సష్టి జరిగిందని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ పరిశ్రమనుకూల చర్యల వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకుపైగా చేరుకున్నట్లు ఇటీవల 2021-22 ఆర్థిక ఏడాది ప్రభుత్వం విడుదల చేసిన ఐటీ వార్షిక నివేదిక వెల్లడించింది. అయితే 2021-22 ఆర్థిక ఏడాది కొవిడ్‌ సంక్షౌభం తర్వాతి ఏడాది కావడంతో డిజిటల్‌ ఉప రంగంలో వచ్చిన భారీ డిమాండ్‌ కారణంగానే ఐటీ ఎగుమతులు ఒక్కసారిగా పెరిగాయన్న వాదన కూడా పలువురు ఐటీ రంగ నిపుణులు తెరపైకి తీసుకువస్తున్నారు.

టెక్‌ గ్రాడ్యుయేట్లకు స్వర్ణయుగం 2021-22

కొవిడ్‌ తర్వాతి ఆర్థిక ఏడాది 2021-22 రాష్ట్రంలోని టెక్‌ గ్రాడ్యుయేట్లకు పూర్తిస్థాయిలో కలిసి వచ్చినట్లు ఆ ఏడాది జరిగిన కొత్త నియామకాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బీటెక్‌, నాన్‌ బీటెక్‌ గ్రాడ్యుయేట్లు అన్న తేడా లేకుండా కొత్తగా లక్షకుపైగా యువతకు ప్రముఖ ఐటీ కంపెనీలతో పాటు చిన్న, మధ్యతరహా కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ఈ స్థాయిలో ఉద్యోగాలు భవిష్యత్తులో ఒకే ఏడాదిలో సృష్టి జరగడం అంత ఈజీకాదని, 2021-22 ఐటీ రంగానికి స్వర్ణయుగం లాంటిదని ప్రముఖ హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

పొంచి ఉన్న మాంద్యంతో తగ్గనున్న ఎగుమతులు..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తొలుత రాష్ట్రంలోని ఐటీ రంగంపైనే పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గి ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టుల విలువల్లో కోత పడనుందని చెబుతున్నారు. ఈ ప్రభావం కంపెనీల సేల్స్‌, ఎగుమతుల ఆదాయాలపై తీవ్రంగా పడనుంది. దీంతో కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు కొత్త ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా ఆపినా ఆశ్చర్యం లేదని పలు మిడ్‌ సైజ్‌ ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సమయంలో ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా మాంద్యంతో తమ ఆదాయాలు పడిపోయి ఆ ప్రభావం నియామకాల మీద పడనుందని వెల్లడించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement