Tuesday, November 26, 2024

తప్పుడు యాడ్స్​కి భారీ వడ్డీంపు.. సెలబ్రేటీలు జర జాగ్రత్త!

వాణిజ్య ప్రకటన పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే, అసత్యాలతో కూడిన ప్రకటనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. కొత్త మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్న పిల్లల ను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రకటనల విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు. పిల్లల కోసం చేస్తున్న ప్రకటనల్లో తప్పుదోవపట్టించేలా తమ ఉత్పత్తులను వినియోగిస్తే ఎత్తు పెరగడం, లావు తగ్గడం, తెలివి తేటలు వస్తాయని, శక్తి వస్తుందని చేసే ప్రకటనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. వాణిజ్య ప్రకటనలో వస్తువులో వాస్తవంగా ఏం ఉందో దాన్ని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ప్రతి కంపెనీ తన ఉత్పత్తి విషయంలో పారదర్శకంగా వివరాలను ప్రకటనలో చెప్పాల్సి ఉంటుంది. వాస్తవ దూరంగా, అతిశయోక్తుల తో కూడిన ప్రకటనలు జారీ చేయడం ఇక నుంచి నిషేధం. ఇలాంటి ప్రకటనలు వినియోగదారుల హక్కలకు భంగం కల్గిస్తాయని కన్జ్యూమర్‌ ఎఫైర్స్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. తప్పుడు ప్రకటనలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసే వారిపైనా, అందులో నటించిన వారిపైనా, ప్రచురించిన, ప్రసారం చేసిన వారిపై మొదటిసారి 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇలాంటి ప్రకటనలు జారీ చేసే వారిపై మూడు సంవత్సరాల నిషేధం విధిస్తారు. సెలబ్రేటీలు తాము ఎండార్స్‌ చేసే వస్తువు, ఉత్పత్తుల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతే నటించాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచర్చించారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకటనకర్తలకు, ప్రచురణ, ప్రసార కర్తలకు వర్తిస్తాయి. ఉత్పత్తులను ప్రయోట్‌ చేసే సెలబ్రేటీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించే వారు చిక్కుల్లో పడక తప్పదు. కేసులు, జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వినియోగ దారుల రక్షణ చట్టం కింద తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేసిన వారిపైనా, ప్రచురించిన వారిపైనా, వాటిని ప్రమోట్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ , సోషల్‌ మీడియా ఎలాంటి మాధ్యంలోని ప్రకటనలకైనా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై వినియోగదారులు, వినియోగదారుల హక్కుల కోసం పని చేస్తున్న సంస్థలు ఫిర్యాదు చేయవచ్చు. ఇక నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక దాన్ని ప్రయోట్‌ చేస్తూ, మరొకదాన్ని ఉచితంగా ఇస్తామని చేసే ప్రకటనలపై నిషేధం ఉంటుంది. ప్రకటనలో ఉన్న ఉత్పత్తి వాస్తవ వివరాలనే వినియోగదారులకు చెప్పాల్సి ఉంటుంది. నిషేధ జాబితాలో ఉన్న వాటిని కొన్ని కంపెనీలు పరోక్షంగా అదే పేరుతో మరో ఉత్పత్తిని పెట్టి ప్రచారం చేస్తుంటాయి. మద్యం కంపెనీలు , గుట్కా కంపెనీలు ఎక్కువగా ఇలాంటి ప్రకటన లు ఇస్తుంటాయి. ఇక నుంచి ఇలాంటి వాటిని అమనుమతించరు. తప్పుడు సమాచారంలో ఇచ్చే ప్రకటనలు వినియోగదారుల హక్కులను హరించడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇలా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన వారికి ఇప్పటికే 113 నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో 57 తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఉన్నాయి. అనైతిక వ్యాపార ప్రకనలు జారీ చేసిన వారికి 47 నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగేలా ప్రకటనలు ఇచ్చిన 9 సంస్థలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదులు వచ్చిన తరువాత 14 కంపెనీలు తమ అడ్వర్టైజ్‌మెంట్లను ఉపసంహరించు కున్నాయి. మూడు కంపెనీలు నోటీలు జారీ చేసిన తరువాత సవరించిన ప్రకటనలను జారీ చేశాయి. రిఫండ్‌, రీ ప్లేస్‌ చేస్తామని ప్రకటన జారీ చేసిన కంపెనీ దాన్ని ఉపసంహరించుకుంది. తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు జారీ చేసిన మూడు కంపెనీలకు 10 లక్షల చొప్పున జరిమానా విధించారు. అనైతిక వ్యాపార ప్రకటనలు ఇచ్చిన మూడు కంపెనీలకు లక్ష రూపాయల చొప్పున ఫైన్‌ విధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement