విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్లో ఈ సంస్థ నూతన కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.
రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలను ఈ కొత్త సదుపాయంలో ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.
2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డిఆర్ డిఓ క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సిఐఐ ఛైర్మన్ డా.సాయి ప్రసాద్, టిజిఐఐసి ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పిఏ ప్రవీణ్, టిజిఐఐసి సిఒఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు