చర్ల, డిసెంబర్ 12 (ఆంధ్రప్రభ) : చత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ దండకారణ్యంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ మవోయిస్ట్ అయిన హిడ్మా స్వగ్రామానికి శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా భద్రతా బలగాలు, డిఆర్జి, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నారాయణపూర్ జిల్లా, అబూజ్ మడ్ దండకారణ్యంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరపడంతో 12మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.