Sunday, November 17, 2024

తాటి కల్లు తాగితే కరోనా రాదా? ఇందులో నిజమెంత?

తాటి కల్లు తాగితే కరోనా వైరస్ రాదనే ప్రచారం కొన్ని ఊళ్లల్లో జోరుగా నడుస్తోంది. దీన్ని కొందరు ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో తాటి కల్లును కరోనా మందుగా భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తాటికల్లుకు డిమాండ్ పెరిగింది.

కరోనాకు మందు లేదు. కరోనా చికిత్సకు వాడే కొన్ని ఔషధాలు కూడా కోవిడ్ తీవ్రతను తగ్గించేవి మాత్రమే. అంతే కానీ కరోనాకు మెడిసిన్ లేదు అని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. అయినా కనుకల గ్రామస్తులు మాత్రం కరోనాకు మందు దొరికిందని సంబరపడుతున్నారు. తాటి కల్లు తాగితే కరోనా రాదనే ప్రచారాన్ని గట్టిగా నమ్ముతున్నారు. తాటి కల్లు తాగేందుకు క్యూ కట్టారు. అంతేకాదు అలవాటు లేని వారు సైతం తాటి కల్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాటి కల్లులో వైరస్ కారకాలను చంపే ఆయుర్వేద గుణం ఉందని, అందుకే తాటి కల్లు తాగిన వారికి కరోనా రావటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నమ్మకంతో కనుకుల గ్రామంలో తాటికల్లుకి గిరాకీ బాగా పెరిగింది. గీత కార్మికులకు ఫోన్ చేసి మరీ కల్లుని బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకోకుంటే కల్లు దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు.

వాస్తవానికి తాటి కల్లు ఆరోగ్యానికి మంచిదేనని వైద్యులు చెప్తున్నారు. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుందని చెబుతారు. తాటికల్లుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయని, జంక్ ఫుడ్స్‌ తిని ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుందని అంటారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతారు. ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వికులు కూడా చెప్పారు. అయితే తాటి కల్లు తాగితే కరోనా రాదనే ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని వైద్యులు స్సష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement